శంషాబాద్ రూరల్, మే 7: రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేద్దామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ సూచించారు. శనివారం శంషాబాద్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ జయమ్మశ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుదామని వివరించారు. గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలని ప్రజాప్రతినిధులను అధికారులను ఆదేశించారు. 111జీవోను ఎత్తి వేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో తీర్మాణం చేయడంతో పాటు సీఎస్ సోమేశ్‌కుమార్ అధ్యక్షతన కమిటీ వేసిందని వివరించారు. కమిటీ నివేదిక ఆధారంగా గ్రామాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంతో పాటు గ్రామ పంచాయతీలకు ఆదాయం వస్తుందన్నారు.
దీంతో పాటు గ్రామాల్లో సీసీరోడ్లు, నాలాలు, విద్యుత్ తీగల సమస్యల పరిస్కారం కోసం ఆయా శాఖల అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. అంతకు ముందు వివిధశాఖల అధికారులు శాఖల వారీగా గ్రామాల్లో జరుగుతన్న అభివృద్ధి పనులను సమావేశంలో వివరించారు. వ్యవసాయం, విద్యా, వైద్యం, రవాణా, రెవెన్యూ, ఇరిగేషన్, తాగునీటి సమస్యలపై చర్చించారు. తాగునీటి సమస్యలను మిషన భగీరథ ద్వారా నీటి సమస్యలేకుండా చేస్తున్నట్లు అధికారులు సమావేశంలో వివరించారు. గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం వేతనాలు పెంచింది. వారికి ఉద్యోగ భద్రత కల్పించడం కోసం ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించే విధంగా అవకాశం కల్పించాలని నర్కూడ గ్రామ సర్పంచ్ సిద్ధులు, లక్ష్మయ్య ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. సమావేశంలో జడ్పీటీసీ తన్విరాజు, వైస్ ఎంపీపీ నీలంనాయక్, ఎంపీడీవో వసంతలక్ష్మి, ఎంపీటీసీలు చెక్కల ఎల్లయ్య, ప్రవీణ్‌కుమార్, ఇందిరాదేవి, యాదయ్యగౌడ్, గడ్డమీది యాదగిరి, సర్పంచులు దండుఇస్తారి, రవీందర్ రాజ్‌కుమార్, సతీశ్‌యాదవ్, నర్సమ్మ, బుచ్చమ్మ, దేవికగౌడ్, మండల కో-ఆప్షన్ సభ్యుడు గౌస్‌పాషా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.