బడంగ్‌పేట, మే 31: మహేశ్వరం నియోజకవర్గవ్యాప్తంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ ఆర్ఏసీఐ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గవ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. 1 నుంచి 3 వరకు కార్యక్రమాలు ఉంటాయని ఆమె వెల్లడించారు. శనివారం సాయంత్రం 6 గంటలకు అమరవీరులకు నివాళులర్పిస్తూ.. కొవ్వొత్తుల ర్యాలీ, 2న సాయంత్రం 6 గంటలకు జిల్లెలగూడ చందన చెరువు కట్టపై ఉన్న అమర వీరుల స్తూపం వద్ద అమర వీరుల కుటుంబాలు, తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం ఉంటుందన్నారు. 3న అన్ని మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్, డివిజన్ల పరిధిలో జాతీయ జెండాలతో పాటు బీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించాలన్నారు.