Leopard | హైదరాబాద్ : హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చిరుత పులులు సంచరిస్తున్నట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం గండిపేట సమీపంలోని పోలీసు గ్రే హౌండ్స్ గ్రౌండ్లో చిరుత పులి సంచరించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి.
అయితే తాజాగా గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు అటుగా వెళ్లిన ప్రయాణికులు చెబుతున్నారు. తారామతి బారదరి మెయిన్ రోడ్డుపై చిరుత నడుస్తూ మూసీ నది వైపు వెళ్లినట్లు వాహనదారులు పేర్కొన్నారు. గోల్కొండ పరిధిలోని ఇబ్రహీంబాగ్ ఏరియాలో కూడా ఓ పులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అయితే చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు. ఏదేమైనప్పటికీ స్థానికులు, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.