సిటీబ్యూరో/చిక్కడపల్లి, జులై 9 (నమస్తే తెలంగాణ ): దేశ వ్యాప్తంగా బుధవారం జరిగిన సార్వత్రిక సమ్మె(భారత్ బంద్) విజయవంతంమైంది. పార్టీలకతీతంగా నాయకులు, కార్మిక సంఘాలు, ప్రజలు సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ క్రమంలో కార్మికుల హక్కుల కోసం భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్(బీఆర్టీయూ) గొంతెత్తింది. సుందరయ్య విజ్ఞానం కేంద్ర నుంచి ఇందిరాపార్క్ వరకు కార్మిక కంఘాలతో కలిసి భారీ ర్యాలీ తీశారు.
ఈ సందర్భంగా బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు దిగుతోందని ఆరోపించారు. నూతన కార్మిక కోడ్లు, ఉద్యోగ భద్రత కరువు, పెన్షన్ తొలగింపు వంటి విధానాలను ప్రజల్లో ఎండగట్టారు. నూతన కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలని నినదించారు. కార్మికులకు గౌరవ వేతనం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య, టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎల్ పద్మ, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్రాజ్, సీఐటీయూ భాస్కర్, ఐఎఫ్టీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో..
సికింద్రాబాద్, జూలై 9: కార్మికులు, కర్షకులు, వృత్తిదారులు దేశవ్యాప్తంగా చేస్తున్న సమ్మెలో భాగంగా సికింద్రాబాద్లోని చిలకలగూడ చౌరస్తా వద్ద మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, సభ జరిగింది. మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కొప్పు పద్మ అధ్యక్షతన జరిగిన సభలో వృత్తి సంఘాల రాష్ట్ర కన్వీనర్ ఎంవీ రమణ మాట్లాడారు.
ఎన్నో ఏండ్లుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడే విధంగా నూతనంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. మత్స్యకారుల వృత్తిలోకి కార్పొరేట్ శక్తులు ప్రవేశిస్తున్నాయని దీనివల్ల లక్షలాదిమంది వృత్తి దెబ్బ తింటుందని అన్నారు. జీఎంపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్, హైదరాబాద్ మత్స్య మహిళా విభాగం కన్వీనర్ అమరావతి, మేడ్చల్ జిల్లా మత్స్య మహిళా విభాగం జిల్లా కన్వీనర్ బాలమని, నాయకులు అరుణ, నవనీత తదితరులు పాల్గొన్నారు.
సార్వత్రిక సమ్మెలో ఎల్ఐసీ ఉద్యోగులు
సిటీబ్యూరో: జాయింట్ ఫోరమ్ ఆఫ్ ఫైనాన్స్ సెక్టార్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ ఎల్ఐసీ డివిజన్ కార్యాలయంలో సమ్మె ర్యాలీ జరిగింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల నుంచి 600 మందికి పైగా ఈ సమ్మెలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా సీఐటీయూ రాష్ట్ర నాయకులు వీరయ్య, ఏఐటీయూసీ నాయకులు బోస్, అఖిల భారత గ్రామీణ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ పాలసీల మీద జీఎస్టీని రద్దుచేసి వినియోగదారులకు మేలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాతాదారుల సేవల మీద చార్జీలను తగ్గించాలని కోరారు.