బడంగ్పేట్, డిసెంబర్9: బడంగ్పేట్ సర్కిల్‌ను ఎల్బీనగర్ జోన్లో కలుపాలని రోజురోజుకు డిమాండ్ పెరుగుతుంది. అన్ని పార్టీల నాయకులు సమావేశాలు ఏర్పాటు చేసి ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. బస్తీల్లో సంతకాల సేకరణ చేపడుతున్నారు. ప్రజల మద్దతును కూడగడుతూ కాలనీల్లో పర్యటిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్‌కు వినతి పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జీహెచ్ఎంసీ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడారు. బడంగ్‌పేట్‌ను చార్మినార్‌లో విలీనం చేసే ప్రతి పాదనను విరమించుకోవాలని సూచించారు.
అన్ని వర్గాల ప్రజల నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని కమిషనర్‌కు తెలిపారు.ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసి వినతి పత్రాలు అందజేస్తున్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం పై మండిపడుతున్నారు. జీహెచ్ఎంసీని 300 డివిజన్లుగా చేయడంతో అయోమయానికి గురవుతున్నారు. ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా ప్రభుత్వం ఇష్టాను సారంగా చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరూ జేఏసీగా ఏర్పాటై విలీనం చేసే వరకు ఉద్యమాలు చేపడుతామని హెచ్చరిస్తున్నారు. బడంగ్‌పేట్‌ను జోనల్ కార్యాలయమన్నా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చార్మినార్ జోన్లో కల్పితే నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చార్మినార్ జోన్లో కలుపొద్దు: రాంరెడ్డి, మాజీ సర్పంచ్
చార్మినార్ జోన్లో కలుపొద్దు. ప్రజలకు ప్రయా ణ సౌలభ్యం ఉండదు. రోడ్లు సరిగా ఉండవు. బస్సు సౌకర్యం కూడా ఉండదు. భవనాలు లేవు. ఇరుకు గదుల్లో ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎ లాంటి ప్రయోజనం ఉండదు. ఈ ప్రాంతంలో వస్తున్న నిధులను అక్కడ ఖర్చు చేయవలసి ఉం టుంది. తుక్కుగూడ, మీర్‌పేట్‌ను ఎల్బీనగర్లో కలిపి బడంగ్‌పేట్‌ను చార్మినార్‌లో కల్పడం సరైంది కాదు.