ఎల్బీనగర్, సెప్టెంబర్ 21: ఎల్బీనగర్ కాంగ్రెస్‌లో టికెట్ లొల్లి ఢిల్లీకి చేరింది. గల్లీ స్థాయిలో తామే అభ్యర్థులమంటూ పోరాటం చేసిన కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వేదికగా స్థానికేతరులకు టిక్కెట్ ఇవ్వొద్దంటూ అగ్రనాయకులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుకు కేరాఫ్ అడ్రస్‌గా నిల్వగా.. తాజా సంఘటనతో స్థానికం, స్థానికేతరుల అంశం తెరపైకి వచ్చింది. ఏండ్లుగా తాము పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్నాం.. డేగలా వచ్చి టికెట్ ఎగరేసుకుని పోతే ఎట్లా అంటూ.. స్థానిక నాయకగణం ప్రశ్నిస్తుండటంతో కాంగ్రెస్‌లో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. దీంతో ఎల్బీనగర్ కాంగ్రెస్ టికెట్ వివాదం ఢిల్లీ స్థాయిలో ముదురుతున్నది. స్థానికంగా వచ్చిన ముసలంతో అగ్ర నాయకులు సైతం అయోమయం చెందుతున్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ తమకే కావాలంటూ జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి, కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి, మిద్దెల జితేందర్, సుదిని మహేందర్ తదితరులు కోరుతూ స్థానికంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. వీరిలో వీరే తామంటే తామే ఇన్చార్జిలమంటూ పోటాపోటీగా ప్రకటనలు గుప్పించి కాంగ్రెస్ సంస్కృతిని గుర్తుకు తెచ్చారు. అంతటితో ఆగకుండా తమకే టికెట్ వస్తుందంటూ కాలనీల్లో పాదయాత్రలు సైతం మొదలుపెట్టారు. వీరిలో ఈ వివాదం ఇలా ఉండగానే టికెట్ దరఖాస్తులో భాగంగా నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తాను ఎల్బీనగర్ కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తానంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఏకంగా పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ హోదాలో పార్టీ టికెట్‌కు దరఖాస్తు చేసుకోవడంతోపాటుగా తాను పోటీ చేస్తానంటూ ప్రకటన కూడా చేసేశారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హయత్‌నగర్ తన స్వస్థలమని, పాఠశాల విద్య కూడా ఇక్కడేనంటూ పేర్కొంటూ కొన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. దీంతో అప్పటిదాకా పోరాటంతో నేనంటే నేనే అన్న స్థానిక నాయకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మధుయాష్కీ తానే ఎమ్మెల్యే అభ్యర్థినంటూ ప్రకటించుకుంటుంటే అయోమయం నుంచి తేరుకున్న ఎల్బీనగర్ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ బాటపట్టారు. ఈ మేరకు అంతా కలిసికట్టుగా ఢిల్లీ చేరుకుని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతోపాటుగా సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితోపాటుగా ఇతర పార్టీ పెద్దలకు వినతిపత్రాలు అందజేస్తున్నారు. ఎల్బీనగర్ టిక్కెట్ మధుయాష్కీకి ఇవ్వకండి.. స్థానికంగా మాలో ఎవరికైనా ఇవ్వండి అంటూ పేర్కొంటున్నారు. వలస నాయకులను వద్దని ఖరాఖండీగా కోరుతున్నామని లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేస్తున్నారు.