సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ);రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఈ విషయం కాంగ్రెస్, బీజేపీ నాయకులకూ తెలుసునని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏదో మాట్లాడాలని వారు మాట్లాడతరు తప్పితే.. బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని వారికీ తెలుసన్నారు. ఎస్ఆర్డీపీలో రూ.32కోట్లతో చేపట్టిన 19వ ప్రాజెక్టు ఎల్బీనగర్ ఆర్హెచ్ఎస్ ఫ్లైఓవర్‌ను శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఎల్బీనగర్ చౌరస్తాకు అమరుడు శ్రీకాంతాచారి పేరు పెడుతామని ప్రకటించారు. ప్రజారవాణా మెరుగుపరచడంలో భాగంగా నాగోల్ నుంచి ఎల్బీనగర్కు మెట్రో రైలును అనుసంధానిస్తామని చెప్పారు. వచ్చే టర్మ్‌లో హయత్‌నగర్ వరకు విస్తరించి, ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను తీసుకెళతామన్నారు. ఈ నెలాఖరు వరకు జీవో నం. 118 కింద పట్టాలు ఇస్తామని, మరో ఏడాదిన్నరలో గడ్డి అన్నారం వెయ్యి పడకల దవాఖాన అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎస్ఆర్డీపీలో భాగంగా ఎల్బీనగర్లో చేపట్టిన 12 పనుల్లో 9 పూర్తి చేశామని, మరో మూడు పనులు కూడా సెప్టెంబర్‌లోగా పూర్తి చేస్తామని, ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, ఈ విషయం కాంగ్రెస్, బీజేపీ నాయకులకూ తెలుసునని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏదో మాట్లాడాలని వారు మాట్లాడతరు తప్పితే.. బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని వారికీ తెలుసన్నారు. ఎస్ఆర్డీపీలో రూ.32కోట్లతో చేపట్టిన 19వ ప్రాజెక్టు ఎల్బీనగర్ ఆర్హెచ్ఎస్ ఫ్లైఓవర్‌ను శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ప్రజారవాణా మెరుగుపడాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో విస్తారంగా ఫ్లై ఓవర్లను, అండర్ పాస్‌లను చేపడుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చొరవతో జీవో నెంబర్ 118 కింద ఎల్బీనగర్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకున్నామని, ఈ నెలాఖరునాటికి పట్టాలు అందిస్తామని ప్రకటించారు. మిగిలిపోయిన కాలనీల వారికి కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో వరదలు వచ్చినప్పుడు ఎల్బీనగర్లో కూడా పర్యటించినట్లు చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఎస్ఆర్డీపీ తరహాలోనే ఎస్ఎన్డీపీ కింద పనులు ప్రారంభించుకున్నామని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. కొన్ని పనులు పూర్తయ్యాయని, రూ.985కోట్లతో చేపడుతున్న పనులన్నింటినీ వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. జీవో నం.58, 59 కింద హైదరాబాద్ నగరంలో 1.25లక్షల మందికి పట్టాలిచ్చామని, మరింత మందికి లబ్ధి చేకూర్చేందుకు కటాఫ్ తేదీని జూన్ 2020గా నిర్ణయించి గడువును కూడా పెంచినట్లు చెప్పారు. ఈ జీవోల కింద ఇంకా మిగిలిపోయిన పేదవాళ్లందరికీ పట్టాలిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు కోరుకుంటున్నట్లుగా మౌలిక వసతులు, ప్రజా రవాణా, ప్రజా ఆరోగ్యం, దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ముందు చూపుతో మంత్రి కేటీఆర్ చేపట్టిన పనులతో ఎల్బీనగర్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తీరాయన్నారు. ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికతోనే ఇది సాధ్యపడిందన్నారు. ఉస్మానియా, నీలోఫర్ వంటి ఆసుపత్రులన్నీ నిజాం కాలంలో నిర్మించినవేనని, గత ప్రభుత్వాలు కొత్తగా ఒక్క దవాఖానను నిర్మించలేదని ఎద్దేవా చేశారు. రూ.1200 కోట్లతో వెయ్యి పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేయడం అభినందనీయమన్నారు. ఆటో నగర్ డంపు యార్డ్ సమస్యను పరిష్కరించాలని మంత్రి కేటీఆర్‌ను ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారం దయానంద్, టీఎస్‌టీడీసీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, డిఫ్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, టీఎస్ రెడ్కో చైర్మన్ సతీశ్‌రెడ్డి, కార్పొరేటర్లు వెంకటేశ్వర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు సీఈ దేవానంద్, ఎస్సీ రవీందర్ రాజు, ఈఈ రేణుక తదితరులు పాల్గొన్నారు.
నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో
ప్రజా రవాణా మెరుగుపడాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని నాగోల్ వరకు ఉన్న మెట్రో లైన్‌ను ఎల్బీనగర్ వరకు అనుసంధానిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హయత్ నగర్‌కు కూడా విస్తరించి అందుబాటులోకి తెచ్చే బాధ్యత మాదేనని అన్నారు. వచ్చే టర్మ్‌లో ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రజా ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గడ్డి అన్నారంలో నిర్మిస్తున్న వెయ్యి పడకల టిమ్స్‌ని ఏడాదిన్నర కాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు.
ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతచారి పేరు
తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి పేరును ఎల్బీనగర్ చౌరస్తాకు నామకరణం చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అలాగే ఫ్లై ఓవర్‌కు మాల్ మైసమ్మ పేరును పెడతామన్నారు. ఇందుకు సంబంధించి వెంటనే ఆదేశాలు జారీచేస్తామన్నారు. గతంలో ఎల్బీనగర్ చౌరస్తాను దాటాలంటే 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టేదని గుర్తు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సర్వాంగ సుందరంగా ఎల్బీనగర్ చౌరస్తా రూపుమారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ.658కోట్లతో 12 పనులను చేపట్టి తొమ్మిది పనులను పూర్తి చేసినట్లు చెప్పారు. మిగిలిన మూడు పనులు బైరామల్ గూడలోని సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్, రెండు లూప్‌లను సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. ఆ పనులను పూర్తి చేశాకనే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు.