సిటీబ్యూరో, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): హైరైజ్ భవనాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి అనుమతుల జారీలో జాప్యం జరుగుతుందని ఇన్నాళ్లు నెత్తినోరు మోదుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ సాక్షాత్తు ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రే శాఖలో సాగుతున్న అధికారుల అలసత్వాన్ని బట్టబయలు చేసినట్లుగా ప్రకటన చేశారు.
బహుళ అంతస్తుల భవనాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి అనుమతులు మంజూరు చేయడానికి అధికారులు ఉద్దేశపూర్వకంగా నిలిపివేస్తున్నారంటూ, ఆలస్యానికి కారకులను గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పురపాలక శాఖ అధికారులతో కలిసి సమీక్షించిన సీఎం.. హెచ్ఎండీఏ పరిధిలో బిల్డ్ నౌ ద్వారా జారీ చేస్తున్న అనుమతులను పరిశీలించారు. ఎంఏయూడీ సెక్రటరీ (హెచ్ఎండీఏ) ఇలంబర్తి, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్లు పాల్గొన్నారు.