నాంపల్లి క్రిమినల్ కోర్టులు, అక్టోబర్ 6, (నమస్తే తెలంగాణ) : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామక్రిష్ణ గవాయ్‌పై సోమవారం ఓపెన్‌కోర్టులో జరిగిన దాడిని తెలంగాణ న్యాయమూర్తుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు తెలంగాణ న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడు జి.రాజగోపాల్, ప్రధాన కార్యదర్శి కె.మురళీమోహన్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. విధి నిర్వహణలో ఉన్న దేశ సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిపై దాడిని యావత్ భారత న్యాయవ్యవస్థపై దాడిగా పరిగణించాలని పేర్కొన్నారు.
రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య పునాదులకు మచ్చతెచ్చే సంఘటనగా భావించాలన్నారు. అత్యున్నత భారత న్యాయవ్యవస్థకు, న్యాయం పట్ల దేశ ప్రజల విశ్వాసానికి సుప్రీం కోర్టు ప్రతీకగా నిలుస్తుందన్నారు. పవిత్ర న్యాయస్థానంలోనే అత్యంత హేయమైన దుర్ఘటన చోటు చేసుకోవడం విచారకరమని, ఈ ఘటనను యావత్ న్యాయమూర్తులందరూ తీవ్రంగా ఖండిస్తున్నారని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన దోషులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ న్యాయమూర్తుల సంఘం డిమాండ్ చేసింది.