నవంబర్ నుంచే స్కెచ్
మహేశ్‌బ్యాంక్ దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి..
సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ సర్వర్‌కు ఉన్న ఐదెంచల సెక్యూరిటీని ఛేదించి సైబర్ క్రిమినల్స్ ‘కీ లాగర్స్’ను అమర్చి.. చొరబడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వాటి ద్వారా కీలకమైన సూపర్ పాస్వర్డ్, ఐడీలను పసిగట్టి.. రూ. 12.93 కోట్లు దోచేశారు. అయితే సర్వర్లోకి ’కీ లాగర్స్’ ఎలా వచ్చాయనే అంశంపై విశ్లేషణ చేస్తున్నారు.
ఈ-మెయిల్ ఐడీలను గుర్తించి..
గత ఏడాది నవంబర్ నుంచే మహేశ్ బ్యాంక్‌పై సైబర్‌నేరగాళ్లు కన్నేశారు. బ్యాంకుకు చెందిన సర్వర్ నిర్వహణకు సంబంధించిన ఈ -మెయిల్ ఐడీలను గుర్తించారు. సర్వర్ సాంకేతిక పరిజ్ఞానం, ఇతరాత్ర వివరాల పేర్లతో నవంబర్ నుంచి వివిధ అంశాలతో కూడిన ఈ- మెయిల్స్‌ను పంపించారు. ఆ ఈ-మెయిల్స్‌లో ‘కీ లాగర్స్’ కూడా ఉన్నాయి. ఈ-మెయిల్లో సర్వర్‌కు సంబంధించిన సబ్జెక్ట్‌ను సూచిస్తూ.. ఒక లింక్‌ను పంపిస్తారు. ఆ లింక్‌ను క్లిక్ చేయగానే.. ఒక అప్లికేషన్ ఆ కంప్యూటర్లో రహస్యంగా సేవ్ అయిపోతుంది. రహస్యంగా ఉన్న ఆ అప్లికేషన్లోనే కీ లాగర్స్ ఉంటాయి. సర్వర్ కోసం ఉపయోగించే ప్రతి కీ వర్డ్‌ను, అ ఈ-మెయిల్ పంపించిన వ్యక్తులకు చేరవేస్తుంది.
అంటే సర్వర్‌ను యాక్సెస్ చేసే కంప్యూటర్‌పై అక్కడి అడ్మిన్ విభాగం ఏ పనిచేసినా.. అది హ్యాకర్లకు ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. ఈ సర్వర్‌లో వివిధ విభాగాలకు సంబంధించిన పాస్వర్డ్లు, చెస్ట్ఖాతాకు సంబంధించి సూపర్ పాస్వర్డ్, సూపర్ ఐడీలు ఉంటాయి. కీ లాగర్స్తోనే పాస్వర్డ్, యూజర్ ఐడీలను సేకరించారు. గత శనివారం రాత్రి 11 గంటల సమయంలో సర్వర్‌పై దాడి చేసి.. ఆదివారం తెల్లవారుజాము వరకు తమ పనిని పూర్తి చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, ఈ కేసులో ఢిల్లీలో ఇద్దరు, త్రిపురలో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొన్నారు.