కంటోన్మెంట్, సెప్టెంబర్ 30: ‘నేను పేదింటి బిడ్డను… సీఎం కేసీఆర్ దీవెనలతో నిరంతరం ప్రజాసేవే ధ్యేయంగా నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా మీ చెల్లిగా, అక్కగా, మీ బిడ్డగా.. మీ ఆశీర్వాదం కోసం వస్తున్నా…అంటూ కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల పాదయాత్రను శనివారం బోర్డు పరిధిలోని ఆరో వార్డు నందమూరినగర్‌లో బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్, విద్యావతిలతో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత ప్రారంభించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తున్న తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విన్నవించారు. దివంగత ఎమ్మెల్యే సాయన్నలాగే ప్రజలందరికీ అనునిత్యం అందుబాటులో ఉంటానని లాస్యనందిత తెలిపారు. కరపత్రాల ద్వారా కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఆసరా పెన్షన్లు, ఇంటింటికీ మంచినీళ్లు, కరెంటు సరఫరా, పారిశుధ్య నిర్వహణ ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందితకు స్థానికుల నుంచి అపూర్వ స్పందన లభించింది. జనమంతా బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న కేసీఆర్ సర్కారుకే అండగా ఉంటామని స్పష్టం చేశారు. జై కేసీఆర్, జయహో బీఆర్ఎస్ అంటూ నినదించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనచూసి యువత బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం బోయిన్‌పల్లిలో అల్వాల్ సర్కిల్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులకు కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మల్కాజిగిరి నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ పరిస్థితులను గమనిస్తున్న కాంగ్రెస్ నాయకులు.. ఆ పార్టీని వదిలిపెట్టి బయటకు రావాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యువత ఉపాధి కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రమాకాంత్‌రెడ్డి, మధుసుదన్‌రెడ్డి, సంతోష్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.