సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు గ్రేటర్ గులాబీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలను బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో జరపనున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు పుట్టినరోజు వేడుకలు ప్రారంభమవుతాయని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కేసీఆర్ జీవిత, రాజకీయ ప్రస్థానంతో కూడిన ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రదర్శన ఉండనున్నది. ఈ సందర్భంగా 71 కిలోల భారీ కేక్‌ను కట్ చేసి కేసీఆర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకోనున్నారు.
నేడు సాకేత్‌లో వృక్షార్చన
మేడ్చల్: కేసీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకొని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ గౌడవెల్లిలోని సాకేత్ భూ సత్వ గృహ సముదాయంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ సంతోష్‌రావు, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. వృక్షార్చన కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంపునకు తన వంతుగా కృషి చేస్తున్న సంతోష్‌తో పాటు మల్లారెడ్డి సాకేత్‌లో 108 మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ నేతలు భాస్కర్ యాదవ్, దయానంద్ యాదవ్ జగన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. వృక్షార్చన కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎంపీ సంతోష్‌రావు అదే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కృషి హోం అనాథశ్రమంలో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేస్తారు.