Hyderabad ORR | సిటీ బ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): నార్సింగి-టీజీపీఏ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో ప్రయాణం అంటేనే వాహనదారులు జంకుతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. గుట్టలను తొలిచి సర్వీస్ రోడ్డును నిర్మించారు. సగం తొలిచిన పెద్దపెద్ద బండరాళ్లు రోడ్డును ఆనుకొని ప్రమాదకరంగా ఉన్నాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఒకచోట భారీ బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో అటువైపు ఎవరూ వెళ్లలేదు కాబట్టి పెను ప్రమాదం తప్పింది.
ఆ ప్రాంతంలో ఆవిధంగానే కిలోమీటర్ మేర బండరాళ్లు పగుళ్లతో ప్రమాదకరంగా ఉన్నాయి. అవి ఏ క్షణాన రోడ్డుపై పడతాయో తెలియని స్థితిలో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఆ దారిలో ప్రయాణమంటేనే హడలిపోతున్నారు. హెచ్ఎండీఏ అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న బండరాళ్లను తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. లేదంటే భారీ వర్షాలు కురుస్తుండటంతో ఏ క్షణంలోనైనా భారీ బండరాళ్లు రోడ్డుపై పడి పెను ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.