మేడ్చల్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): వక్ఫ్ బోర్డు పేరిట రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై ఇంటి యజమానులు ఆందోళన చెందుతున్నారు. మేడ్చల్ జిల్లాలోని మల్కాజిగిరి నియోజకవర్గంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూమిలో ఇండ్లు నిర్మించుకున్నందున రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని వక్ఫ్ బోర్డు ప్రకటించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలో వందలాది కాలనీల్లో సుమారు 19,603 ఇండ్లు ఉండగా, వాటికి యజమానులు ఆస్తిపన్నులను యాధావిధిగా చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడో ఏర్పాటైన కాలనీలు, బస్తీలకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను కల్పించిందని, ఇప్పుడేమో వక్ఫ్ బోర్డు భూమి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమని విమర్శలు వస్తున్నాయి.
కాగా, రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై మల్కాజిగిరి నియోజకవర్గంలోని కాలనీల, బస్తీల ఇంటి యజమానులు ఆందోళనను ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. రిజిస్ట్రేషన్ల నిలిపివేతను ఎత్త్తివేయకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. బాధితులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మద్దతుగా నిలుస్తున్నారు. రిజిస్ట్రేషన్ల నిలిపివేత నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు బాధితులకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.
రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లినా.. ఎలాంటి స్పందన రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ గౌతమ్‌ను స్వయంగా కలిసి బాధితుల తరఫున ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి వినతి పత్రాలను సమర్పించారు. అయితే ప్రభుత్వం స్పందించకుంటే.. బాధితుల తరఫున న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు.