కాందిశీకుల భూములా..? పట్టాదారు భూములా.. వీటిపై ఎలాంటి స్పష్టత రాకముందే ఓ భవన నిర్మాణ రంగ సంస్థ ఆ వివాదాస్పద భూమిలో అర్ధరాత్రి కబ్జాల దౌర్జన్యానికి పాల్పడింది. ఈ ఘటన పుప్పాలగూడ-కోకాపేట గ్రామాల సరిహద్దులో తీవ్ర కలకలం రేపింది. వందమంది బౌన్సర్లతో అర్ధరాత్రి భూమిలోకి చొరబడి అడ్డంగా ఉన్న రేకులను తొలగించి.. జేసీబీల సహాయంతో వివాదాస్పదంగా ఉన్న భూమిలో రహదారి పనులు కొనసాగిస్తుండటాన్ని అడ్డుకున్న భూ యజమానులపై దాష్టీకంగా దాడులకు పాల్పడి.. కబ్జాలకు పాల్పడ్డారంటూ బాధితులు బోరుమంటున్నారు. ఇదేం న్యాయమంటూ.. ప్రశ్నించినందుకు తమపై పోలీసులు కేసులు నమోదు చేశారని వాపోయారు.
– మణికొండ
రంగారెడ్డి జిల్లా గండిపేట రెవెన్యూ మండలం పుప్పాలగూడ గ్రామ సర్వేనంబరు 300లలో ప్రొసిడింగ్ నంబరు డీ3/87/1993 ఆర్డర్ తేది 16-12-1994 ద్వారా 13ఎకరాల ఒక గుంట భూమి పుప్పాలగూడ గ్రామానికి చెందిన నాగుల సత్తయ్య, నాగుల స్వామి, నాగుల శ్రీనివాస్‌ల పేరిట వారసత్వంగా పొందిన ఆ కుటుంబ సభ్యులు వారి అవసరాల కోసం 2002లో 12ఎకరాల 10 గుంటల భూమిని ఇతరులకు విక్రయించారు. మిగిలిన 0-31గుంటల భూమిలో సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2004లో ఆ భూములన్నీ కాందిశీకులకు చెందినవంటూ వాటిలో ఎలాంటి క్రయవిక్రయాలు జరుపరాదంటూ అప్పటి జిల్లా కలెక్టర్ సీసీఎల్ఏకు లేఖ రాయడంతో అప్పటి నుంచి ఆ భూముల వివాదం న్యాయస్థానానికి చేరింది.
ఓ వైపు న్యాయస్థానంలో వివాదంపై ఎలాంటి స్పష్టత రాకముందే ఆ భూమి గూగుల్ నక్షా ప్రకారం రహదారిగా కన్పిస్తుందంటూ అప్పటి పంచాయతీ రాజ్‌శాఖ అనుమానాస్పదంగా లేఖ సంధించింది. దీంతో దానిపై బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో పాటు 12ఎకరాల 10 గుంటల సేల్‌డీడ్‌లో మిగిలిన భూమి రహదారిగా తప్పుగా నమోదు కావడంతో దాన్ని సవరించుకోవాలంటూ సదరు కొనుగోలుదారుడికి న్యాయస్థానం నుంచి నోటీసులు జారీ చేసి సవరణ సరిచేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇవన్నీ జరుగుతుండగా ఈ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశనంటడంతో కోకాపేట గ్రామ సర్వే నంబరు 90లోని ప్రైవేటు భూమిలో ఓ నిర్మాణరంగ సంస్థ బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టింది.
ఈ నిర్మాణాలకు వివాదాస్పదంగా మారిన సర్వే నంబరు 300లోని 0-31 గుంటల భూమినే రహదారిగా చూపి హెచ్ఎండీఏలో అనుమతులు పొందారని తెలిసింది. ఈ క్రమంలోనే స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులతో మంతనాలు జరిపి రాత్రికి రాత్రే భూముల నుంచి రహదారి వేసేందుకు యత్నిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. మా భూమిగా అదే రెవెన్యూ అధికారులు పాసుపుస్తకాలు మంజూరుచేసి ఇప్పుడు అవన్నీ చెల్లవంటూ అదే అధికారులు అప్పీలు చేయడం, ఆపై ఆ భూమి ఎవరికి చెందినదో న్యాయస్థానమే చెప్పాలని వివాదం కొనసాగుతుండగానే హెచ్ఎండీఏ అనుమతులు ఇవ్వడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వివాదాస్పద భూమిలో అనుమతులేలా..?
ఓ వైపు న్యాయస్థానంలో వివాదాలు కొనసాగుతుండగా దాదాపు రూ.100కోట్ల విలువైన భూమిలో రహదారి ఉందంటూ హెచ్ఎండీఏ అధికారులు అక్రమదారిలో అనుమతులు ఇచ్చారంటూ ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ నిర్మాణరంగ సంస్థ పక్కనే ఉన్న కొంత ప్రభుత్వ భూమిని సైతం కబ్జాచేసి ప్రాజెక్టు నిర్మాణం చేస్తుందన్న వాదనలు ఉన్నాయి. ఏకంగా సర్కారు భూమిలోనే మార్కెటింగ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా వ్యాపారం కొనసాగిస్తున్నా.. అడిగే నాథుడే కరువైయ్యాడని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.
అన్నీ సక్రమంగా ఉంటే అర్థరాత్రి రహదారి పనులు చేయాల్సిన అవసరం ఏమిటీ అంటూ ప్రశ్నలు సందిస్తున్నారు. వీటిపై సదరు నిర్మాణ రంగ సంస్థ ప్రతినిధులు నోరుమొదపడం లేదు. మౌనమే అక్రమాలకు అంగీకారమా? అనే సందేహాలు విన్పిస్తున్నాయి. నగర శివారు ప్రాంతంలోని కోకాపేట-పుప్పాలగూడ సరిహద్దులోని ఓ భూమి వివాదస్పదంగా రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నదని తెలిసినా… వీటిపై నేటికి ఎలాంటి స్పష్టత రాకుండానే హెచ్ఎండీఏ అధికారులు గూగుల్ మ్యాప్ ఆధారంగా అనుమతిలిచ్చారా? లేక తప్పుడు సేల్‌డీడ్‌పై కేసులు కొనసాగుతుండగానే తెలిసి ఇచ్చారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంత బహిరంగంగా విలువైన భూములను ఆక్రమిస్తుంటే కాపాడాల్సిన రెవెన్యూ, పోలీసు యంత్రాంగం కబ్జాదారులకే కొమ్ముకాస్తున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు.
గూగుల్ చిత్రాలు ప్రామాణికమా?
గూగుల్ చిత్రాలను ప్రామాణికంగా చూసి నార్సింగి పోలీసులు రహదారిగా నిర్థారించారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. వివాదాస్పద భూముల్లో పోలీసుల జ్యోకం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నిస్తున్నారు. గూగుల్మ్యాపులో రహదారిగా కనిపిస్తే అసలు మా భూమి ఎక్కడుందో వారే చెప్పాలని బాధితులు అడుగుతున్నారు. వీటిపై రెవెన్యూ అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పాలని కోరుతున్నారు. ఓ డాక్యుమెంట్లో తప్పుగా పడిదంటూ కోర్టులో వివాదాలు కొనసాగుతుండగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు వేర్వేరుగా ఒకసారి రహదారి ఉందంటూ మరోసారి పట్టా భూమి అంటూ ఇచ్చారని భాధితులు తెలిపారు. దీనిలో ఏదీ ప్రామాణికమంటూ ప్రశ్నించారు.
ఆ భూములన్నీ కాందీశీకులకు సంబంధించినవే: తహసీల్దార్
పుప్పాలగూడ గ్రామ సర్వేనెంబరు 300లోని భూములన్నీ కాందీశీకులకు సంబంధించినవేనని గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి వివరణ ఇచ్చారు. కాందీశీకులకు సంబంధించిన సంబంధీకులకే అప్పగించాలని ఉన్నతాధికారుల ఆదేశాలున్నాయని, వారి ఆదేశాల మేరకే తాము చర్యలు తీసుకుంటామన్నారు. ఆ భూములన్నీ వివాదాస్పదంగానే ఉన్నాయని తెలిపారు. త్వరలోనే అక్కడ పర్యటించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.