సిటీబ్యూరో/రామచంద్రాపురం, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : మహానగరానికి తలమానికంగా మారిన ఐటీ కారిడార్‌కు అత్యంత సమీపంలో ఉన్న కొల్లూరు శిల్పా డ్రీమ్ వ్యాలీ లే అవుట్లో వందల కోట్ల రూపాయల భూ ఆక్రమాల పర్వానికి తెరలేపారు. 26 ఏండ్ల కిందట వెంచర్ నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండా కబ్జా చేసి, ప్లాట్లుగా మార్చి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు గ్రామ పంచాయతీ లే అవుట్ కావడంతో సులువుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కొనసాగించారు. వాస్తవానికి గ్రామ పంచాయతీ లే అవుట్‌లోనూ 10 శాతం ఓపెన్ స్పేస్‌ను కేటాయించి ప్రజా అవసరాలకు వినియోగించాల్సి ఉంటుంది.
గ్రామ పంచాయతీ పరిధిలో ఏ లే అవుట్ అయినప్పటికీ 10 శాతం ఓపెన్ స్పేస్ పర్యవేక్షణ బాధ్యత హెచ్ఎండీఏ అధికారులకు ఉంది..కానీ ఇక్కడ కొందరు హెచ్ఎండీఏ, రిజిస్ట్రేషన్ శాఖ, స్థానిక మున్సిపల్ అధికారుల సహకారంతో సదరు లే అవుట్ నిర్వాహకులు మిగులు భూమిని మింగేశారు. 113 ఎకరాల లే అవుట్లో దాదాపు 11 ఎకరాలకు పైగా మిగులు స్థలం అంటే సుమారు రూ. 300 కోట్లకు పైగా విలువ చేసే ఈ 10 శాతం భూమిని ప్లాట్లుగా మలిచి సొమ్ము చేసుకున్నారు. ఇంతటి ఆగకుండా తాజాగా ఇదే లే అవుట్లో రూ. 50 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని ఎలాగైనా దక్కించుకునేలా కన్ను వేశారు. శిల్పా డ్రీమ్ వ్యాలీ లే అవుట్లో జరుగుతున్న వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1998-2000 మధ్య కాలంలో రాయలసీమకు చెందిన ఒకప్పటీ అగ్రనేత తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తెల్లాపూర్ శివారు కొల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో నిరుపేద రైతుల నుంచి తక్కువ ధరలకే భూములను సేకరించారు. సర్వే నంబర్లు 119,121 నుంచి 134, 136, 139, 141 పరిధిలో దాదాపు 113 ఎకరాల విస్తీర్ణంలో ‘శిల్పా డ్రీమ్ వ్యాలీ’ పేరుతో ఒక భారీ లే అవుట్‌ను నిబంధనల ప్రకారం రూపొందించి ప్లాట్లను విక్రయించారు. ఐతే హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం ఇంత పెద్ద వెంచర్లో భవిష్యత్తు ప్రజా అవసరాలైన గుడి, బడి, పార్కులు, వాటర్ ట్యాంకులు, కమ్యూనిటీ హాల్స్ వంటి మౌలిక వసతులకు 10 శాతం భూమిని ఓపెన్ స్పేస్‌గా వదిలిపెట్టాలి.
ఈ లెక్కన 113 ఎకరాల వెంచర్లో కనీసం 11 ఎకరాలకు పైగా మిగులు భూమి ఉండాలి. సంబంధిత లే అవుట్ మ్యాప్‌లో కూడా మూడు చోట్ల ఓపెన్ స్పేసెస్, క్లబ్‌హౌస్, పార్కు స్థలం చూపించారు. దీని విలువ సుమారుగా రూ. 300కోట్లకు పైనే ఉంటుంది. కానీ మిగులు భూములను సదరు లే అవుట్ నిర్వాహకులు ప్లాట్లుగా మలిచి విక్రయించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం కొన్ని చోట్ల భారీ నిర్మాణాలు ఈ మిగులు భూమిలోనే జరుగుతున్నాయని, పెద్ద ఎత్తున ప్రజా అవసరాలకు ఉపయోగపడాల్సిన ఈ భూములను పర్యవేక్షించడంలో హెచ్ఎండీఏ, సంబంధిత స్థానిక సంస్థల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడం వెనుక భారీ అవినీతి తిమింగలాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. నిర్వాహకుల నుంచి కొందరు అధికారులకు కోట్లాది రూపాయల అమ్యామ్యాలు ముట్టడం వల్లే లే అవుట్ మ్యాప్‌లను పక్కనబెట్టి మరీ ఆక్రమ నిర్మాణాలకు లైన్ క్లియర్ చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

లేని ప్లాట్‌ను సృష్టించి విక్రయాలు
శిల్పా లే అవుట్లో నిబంధనలకు విరుద్దంగా రోడ్డును, ఖాళీ స్థలాలను బై నంబర్లతో అడ్డగోలుగా విక్రయాలు జరిపారు. ఒక్క ఉదాహరణను పరిశీలిస్తే ఈ లే అవుట్‌లోని 119/ఇ, 136 సర్వేనంబర్లలో 1000 చదరపు గజాల విస్తీర్ణంలో ప్లాట్ నంబరు 109కు వెంకట్రామ్ రెడ్డి యాజమాని. ఈ ప్లాట్‌కు హెచ్ఎండీఏ నుంచి ఎల్ఆర్ఎస్ పథకం వర్తించింది. ఈ ప్లాట్‌కు తూర్పు భాగాన 60 అడుగుల వెడల్పుతో రహదారి ఉండగా, ఈ రోడ్డు మార్గమే సంబంధిత యాజమానికి రవాణా మార్గం..కానీ ఈ రోడ్డును ఆక్రమించడమే కాకుండా 109/ఏ (230 చదరపు గజాలు) నకిలీ ప్లాట్‌ను సృష్టించి 2023 సంవత్సరంలో సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ జరిగింది. ఇక్కడ ప్రస్తుతం వే బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. దీనిపై బాధితుడు వెంకట్రామ్రెడ్డి హైడ్రాలో ఫిర్యాదు చేశాడు. చాలా వరకు ఖాళీ స్థలాలు, రహదారులు బై నంబర్లతో విక్రయాలు జరపడం గమనార్హం.
పార్కు స్థలం కాజేసేందుకు స్కెచ్?
శిల్పా డ్రీమ్ వ్యాలీలో ఉన్న పార్కు స్థలంపైన సదరు వ్యక్తి కన్ను పడింది. లే అవుట్లో మిగిలి ఉన్న ఏకైక శ్వాసకోశం లాంటి పార్కు స్థలంపై పడింది. ప్రస్తుతం శిల్పా లేఅవుట్లో పార్కు స్థలం రేడియల్ రోడ్డు (ఆర్ఆర్-7) మ్యాప్ ప్రకారం 5,333 చదరపు గజాలు ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో దాదాపుగా రూ.50కోట్లకు పైగానే ఉంటుంది. ఇప్పటికే వెంచర్‌లోని మిగులు భూమిని కతం బట్టించిన నిర్వాహకులు ఇప్పుడు పార్కు స్థలాన్ని ప్లాట్లుగా మార్చి సొమ్ము చేసుకోవాలనే పక్కా ప్లాన్‌తో నిర్వాహకులు పావులు కదుపుతున్నారు. భవిష్యత్తులో ఇక్కడ జనాభా విపరీతంగా పెరగనుండడంతో కనీసం పార్కు స్థలమైనా మిగలకపోతే పిల్లలు, వృద్ధుల పరిస్థితి ఏంటని కొనుగోలు చేసిన ప్లాట్ల యాజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శిల్పా వెంచర్పైన పూర్తిస్థాయిలో ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేయిస్తే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
శిల్పా డ్రీమ్ వ్యాలీపైన సమగ్ర విచారణ చేపట్టాలి
కొల్లూర్‌లో ఉన్న శిల్పా డ్రీమ్ వ్యాలీపైన అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలి. వెంచర్‌లోని పార్కు స్థలాలు, ఓపెన్ స్థలా లు ఆక్రమణలకు గురికావడం జరిగింది. ఆ లేఅవుట్లో తాము 109నంబర్ ప్లాట్‌ని కొనుగోలు చేయడం జరిగింది. ఆ ప్లాట్‌కి ఈస్ట్ అండ్ నార్త్ రెండు రోడ్లు ఉన్నాయి. అయితే ఈస్ట్ రోడ్డుని ఆక్రమించుకొని 109/ఏ వేసి ఇతరులకు విక్రయించి తమ కు అన్యాయం చేశారు. ఈ విషయంలో ఇటీవల హైడ్రాకు కూడా ఫిర్యాదు చేయ డం జరిగింది. ఈ అంశంపైన అధికారులు విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలి.
వెంకట్రాంరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొల్లూర్..
ఓపెన్ స్పేస్‌ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి
శిల్పా డ్రీమ్ వ్యాలీలో ఆక్రమణలకు గురైన ఓపెన్ స్పేసెస్‌ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి. వెంచర్‌లోని ఖాలీ స్థలాలు, పార్కు స్థలాలను ప్లాట్లుగా మార్చి బై నంబర్లు వేసి అమ్ముకోవడం జరిగింది. శిల్పా వెంచర్లో జరుగుతున్న అవకతవకల విషయంలో అధికారులు మౌనంగా ఉంటున్నారు. శిల్పా డ్రీమ్ వ్యాలీపైన అధికారులు విచారణ చేపడితే అనేక విషయాలు బయటకు వస్తాయి. నిబంధనల ప్రకారం వెంచర్లో మౌలికసదుపాయల కోసం విడిచిపెట్టాల్సిన పదిశాతం భూమిని హెచ్ఎండీఏ అధికారులు స్వాధీనం చేసుకొని ఆ భూముల్లో హెచ్ఎండీఏ బోర్డులను ఏర్పాటు చేయాలి.
– వడ్డె నర్సింహులు, మాజీ నీటి సంఘం చైర్మన్, తెల్లాపూర్