సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ఓ భూ వివాదం ఏసీపీ మెడకు చుట్టుకుంది. చివరకు ఆయనపై సస్పెన్షన్ వేటుకు దారి తీసింది. తనకు తెలిసిన వ్యక్తి అడిగిన మేరకు అనుమతి లేకుండా మరో వ్యక్తికి సంబంధించిన ఫోన్ లోకేషన్లు సమకూర్చారు. చివరకు అది గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కిడ్నాప్‌కు దారి తీయడం.. 30 ఎకరాల భూమి చేతులు మారడం.. పోలీసు కేసు.. ఇలా మలుపులు తిరిగి విచారణలో అన్ని విషయాలు బయటపడటంతో ఉన్నతాధికారులు ఆ ఏసీపీని సస్పెండ్ చేశారు.పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన శ్రీనివాసరాజు, సత్యనారాయణరాజు చాలా ఏండ్లుగా నగరంలోనే ఉంటున్నారు. వీరిద్దరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు.
ఈ నేపథ్యంలో వ్యాపార లావాదేవీలకు సంబంధించి మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో తనకు డబ్బులు రావాల్సి ఉన్నందున.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధిలో చంద్రధర గ్రామంలో ఉన్న 50 ఎకరాల్లో 30 ఎకరాలను తన పేరిట చేయాలని సత్యనారాయణరాజు, శ్రీనివాసరాజుపై తీవ్రంగా ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు. ఇలా వీరిద్దరి మధ్య చాలాకాలం వివాదం కొనసాగింది. ఈ నేపథ్యంలో కోపంతో సత్యనారాయణరాజు ఎలాగైనా శ్రీనివాసరాజును బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం కిడ్నాప్‌నకు ప్రణాళిక రచించాడు. శ్రీనివాసరాజును కిడ్నాప్ చేయాలని ప్రణాళిక రూపొందించేందుకుగాను ఆయన కదలికలను ఫోన్ లొకేషన్ ద్వారా తెలుసుకోవాలనుకున్నారు. అయితే ఏసీపీ చాంద్‌పాషా కూడా పరిచయం ఉన్న వ్యక్తి కావడంతో ముగ్గురికి మంచి సంబంధాలే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో సత్యనారాయణరాజు సైబర్ క్రైం (సీసీఎస్)లో ఏసీపీ సహకారంతో శ్రీనివాసరాజు ఫోన్ లొకేషన్లను తెప్పించుకున్నారు. తెలిసిన వ్యక్తి అడగటంతో ఏసీపీ కూడా అనుమతి లేకుండానే ఎప్పటికప్పుడు లొకేషన్లను సమకూర్చాడు. దీని ఆధారంగా ప్రతిరోజు ఉదయం శ్రీనివాసరాజు కారులో తన కుమారుడిని పాఠశాల వద్ద దించివేస్తాడని గుర్తించిన సత్యనారాయణ, మరికొందరు కిడ్నాప్ చేసేందుకు అదే సమయం అనువుగా ఉంటుందని భావించారు. ఈ మేరకు 2023, నవంబరు 15వ తేదీన ఉదయం శ్రీనివాసరాజు తన కుమారుడిని పాఠశాలలో దించివేసిన తర్వాత ఉదయం 7.10 గంటల సమయంలో కొండకల్ పరిధిలోని నాగులపల్లి స్టేషన్ వద్ద కారును అటకాయించి, కిడ్నాప్ చేశారు.
కిడ్నాప్‌కు గురైన సమయంలోనే శ్రీనివాసరాజు తన భార్యకు ఫోన్ చేసి అరవడం, ఫోన్ కట్ అవడం జరిగింది. కంగారుపడిన ఆమె తిరిగి ఫోన్ చేస్తే స్విచాఫ్గా రావడంతో వెంటనే శ్రీనివాసరాజు స్నేహితుడు చీకూరి సుబ్బరాజుకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. ఉదయం 9.15 గంటల ప్రాంతంలో సుబ్బరాజు మోకిల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించి, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా శ్రీనివాసరాజుకు చంద్రధాని, కొండకల్, శంకర్పల్లి, తలకొండపల్లి, ఇప్పాయిపల్లి, కేశంపేట ప్రాంతాల్లో భూములున్నాయని అందులో పేర్కొన్నారు. అంటే భూ వివాదాలకు సంబంధించే ఈ కిడ్నాప్ జరిగిందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆ మేరకు మోకిల పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు మొదలుపెట్టారు.
బెదిరించి..కొట్టి.. రిజిస్ట్రేషన్..
సత్యనారాయణరాజు, మరికొందరు కిడ్నాప్ చేసిన శ్రీనివాసరాజును భూమి రిజిస్ట్రేషన్ కోసం బెదిరించడంతో పాటు తీవ్రంగా కొట్టినట్లు బయటపడిన తర్వాత శ్రీనివాసరాజు పోలీసు విచారణలో చెప్పాడు. కిడ్నాప్ చేసి తనను తీవ్రంగా కొట్టి మరుసటి రోజే బలవంతంగా తలకొండపల్లి తాసిల్దార్ ముందు తీసుకుపోయి 30 ఎకరాల భూమిని సత్యనారాయణరాజు తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా విచారణలో వెల్లడించారు. అయితే 2023, నవంబరు 15న కిడ్నాప్ అయిన మరుసటి రోజే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. వాస్తవానికి అప్పుట్లో తలకొండపల్లి తాసిల్దార్‌గా ఉన్న వెంకట రంగారెడ్డి అసెంబ్లీ ఎన్నికల విధుల్లో భాగంగా కల్వకుర్తిలో పని చేస్తున్నారు. నవంబరు 16వ తేదీన 12 మంది రైతులు భూ కొనుగోళ్లకు స్టాట్లు బుక్ చేసుకోగా… తాసిల్దార్ మాత్రం కల్వకుర్తి నుంచి వచ్చి కేవలం శ్రీనివాసరాజు-సత్యనారాయణరాజుకు సంబంధించి 30 ఎకరాల లావాదేవీని మాత్రమే పూర్తి చేసి, వెళ్లిపోయాడు. ఇందుకోసం సాయి అనే వ్యక్తి ద్వారా తాసిల్దార్‌కు పెద్ద ఎత్తున ముట్టచెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. పైగా శ్రీనివాసరాజు గాయాలతో ఉండటంతో పాటు అతనికి సంబంధించిన పాసు పుస్తకం, ఆధార్, పాన్ కార్డు… ఇవేవీ లేకుండానే రిజిస్ట్రేషన్ పూర్తి చేసినట్లు పోలీసు విచారణలో శ్రీనివాసరాజు తెలిపారు.
17 మందిపై కేసు నమోదు
ఈ కిడ్నాప్ వ్యవహారంలో 17 మందిపై కేసు నమోదు చేసిన మోకిల పోలీసులు లోతుగా దర్యాఫ్తు చేసి, ఛార్జిషీట్ వేశారు. ముఖ్యంగా ఏ-16గా ఏసీపీ చాంద్‌పాషా, ఎ-17గా తాసిల్దార్ వెంకట రంగారెడ్డిని చేర్చినట్లు తెలిసింది. ఇద్దరు ఉద్యోగుల హస్తం ఇందులో ఉండటంతో ఈ మేరకు మోకిల పోలీసులు రెవిన్యూ, పోలీసు శాఖలకు నివేదికలు ఇచ్చారు. అయితే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మాత్రం తాసిల్దార్ వెంకట రంగారెడ్డిపై బదిలీ వేటు వేశారు ప్రస్తుతం ఆయన మేడ్చల్ కలెక్టరేట్లో యూఎల్సీ విభాగంలో పని చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు పోలీసు శాఖకు వచ్చిన నివేదిక మేరకు చర్యకు చాలాకాలం జాప్యం జరిగినట్లు తెలిసింది. చివరకు కొంతకాలం కిందట ఉన్నతాధికారులు ఏసీపీ చాంద్‌పాషాపై సస్పెన్షన్ వేటు వేశారు.