సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏలో భూముల వేలానికి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని హెచ్ఎండీఏ లే అవుట్లలోని 100కు పైగా ప్లాట్లకు ఆన్లైన్ వేలం బుధవారం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో తొలి రోజున అత్తెసరు స్పందన వచ్చినట్లుగా తెలిసింది. తుర్కంయాంజల్ వెంచర్ ప్లాట్లను విక్రయించగా, ఊహించినంత డిమాండ్‌ను సొంతం చేసుకోలేదని సమాచారం.
మొత్తం 12 ప్లాట్లకు వేలం నిర్వహించగా.. ఒక్కో ప్లాటుకు రూ. 20లక్షల ఈఎండీని నిర్ణయించారు. వేలంలో భాగంగా గజానికి రూ. 500 చొప్పున విక్రయించాలనే నిబంధన ఉండగా..మధ్యాహ్నం 2గంటలకు జరిగిన వేలంలో తక్కువ మంది పాల్గొన్నట్లుగా సమాచారం. హెచ్ఎండీఏ యంత్రాంగం కూడా భూముల వేలానికి సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచడంతో, మధ్యాహ్నం 2గంటలకు వేలం ప్రక్రియ ముగిసిన వివరాలు బయటకు రాకుండా కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించినట్లుగా సమాచారం.
మొదటి రోజున అత్తెసరు స్పందన వివరాలు బయటకు వస్తే, మరో రెండ్రోజుల పాటు జరిగే వేలంపై ప్రభావం పడుతుందని, వేలం వివరాలను బయట పెట్టడం లేదని పలువురు హెచ్ఎండీఏ అధికారులు పేర్కొన్నారు. అనుకున్నట్లుగా మార్కెట్ తిరోగమన దశలో ఉన్నప్పడు హెచ్ఎండీఏ అట్టహాసంగా వేలం నిర్వహించడం సరికాదనే భావన అటు హెచ్ఎండీఏ వర్గాలతోపాటు, రియల్ ఎస్టేట్ నిపుణులు కూడా వ్యక్తం అవుతుంది. మొత్తానికి హెచ్ఎండీఏ భూముల వేలంపై పెట్టుకున్న ఆశలు నీరుగారిపోతుండటమే సిటీ రియల్ మార్కెట్ తీరుతెన్నులకు నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు.