సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఆదాయమే లక్ష్యంగా హెచ్ఎండీఏ భూముల పందేరం కొనసాగుతోంది. కీలకమైన భూములను వేలంలో విక్రయిస్తూ సర్కార్ సొమ్ము చేసుకుంటున్న నేపథ్యంలో.. సోమవారం మోకీలా కేంద్రంలో ఉన్న హెచ్ఎండీఏ వెంచర్‌లోని 50 ప్లాట్లకు వేలం నిర్వహించింది. రెండు సెషన్లలో నిర్వహించిన ఈ వేలంపాటలో సర్కార్ కనీస ధరగా రూ.50వేలు(గజం)గా నిర్ధారించింది.
అయితే ఒక్కో ప్లాట్ సైజు 300-400 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ 50 ప్లాట్ల ద్వారా కనీసం రూ.150 కోట్లు ఆర్జించాలనే లక్ష్యంతో వేలం నిర్వహించింది. రెండు దఫాలుగా నిర్వహించిన వేలంలో ప్లాట్ నంబర్ 295కు అత్యధికంగా రూ.85వేల ధర పలికినట్లుగా తెలిసింది. రెండో దశ వేలం ప్రక్రియలో 25 ప్లాట్లతో జాప్యం కారణంగా మరుసటి రోజు వరకు నిర్వహిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. వేలం ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్లాట్ల వారీగా వివరాలు వెల్లడించలేదు.