నార్త్ సిటీ వాసుల కష్టాలను తీర్చే ఎలివేటెడ్ కారిడార్‌కు భూసేకరణ గ్రహణంలా మారింది. జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ మార్గంలో, జేబీఎస్ నుంచి మేడ్చల్ మార్గంలో ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ నీటి మూటలా మారుస్తోంది. భూములు ఇస్తేనే పనులు మొదలయ్యే పరిస్థితి నెలకొని ఉండగా, భూసేకరణ చేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం చేతులెత్తివేసింది. దీంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు భవిత అగమ్యగోచరంగా మారింది. ఓవైపు నిధుల కొరత, మరోవైపు శాఖల మధ్య సమన్వయ లోపంతో ఎలివేటెడ్ కారిడార్ కాగితాలకే పరిమితమవుతున్నది.
సిటీబ్యూరో, మే 13(నమస్తే తెలంగాణ) : ప్యారడైజ్ నుంచి మేడ్చల్, జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ మార్గంలో హెచ్ఎండీఏ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును చేపట్టింది. రెండేళ్ల కిందట సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. రక్షణ శాఖ భూముల విషయంలో సయోధ్య కుదిరినా… ప్రైవేటు ఆస్తుల సేకరణ అంశంలో సర్కార్ మంత్రాంగం పనిచేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో భూసేకరణ ప్రక్రియ పూర్తి కాక ప్రాజెక్టు మూలుగుతోంది. ప్రైవేటు భూ యజమానులకు ఇచ్చే పరిహారం విషయంలో హెచ్ఎండీఏ లెక్కలు ఒకలా ఉంటే… క్షేత్రస్థాయిలో మార్కెట్ విలువ మరో ఉందనీ బాధితులు వాపోతున్నారు. ఇక ప్రాజెక్టు వెడల్పును 200 ఫీట్ల నుంచి 100 ఫీట్లకు తగ్గాలనే డిమాండ్ ఉంది. కానీ సర్కారు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏడాదిన్నర కాలంగా స్థానికులు ఆందోళన చేస్తున్నా, భూ సేకరణ విషయంలో కోర్టు కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.
ప్రైవేటు భూములే కీలకం
భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకుండానే హెచ్ఎండీఏ టెండర్లు ఖరారు చేసి, కాంట్రాక్టులు అప్పగించింది. కానీ ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇవ్వకుండా పనులు ఎలా మొదలుపెడతారంటూ భూ యజమానులు ప్రశ్నిస్తున్నారు. తొలుత రక్షణ శాఖ నుంచి భూములు తీసుకోవడమే అతిపెద్ద సమస్యగా భావించారు. బీఆర్ఎస్ హయాంలో కేంద్రంతో జరిపిన చర్చలు ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఇప్పుడు కీలకమైన 1500 ఆస్తులకు పైగా ఉన్న ప్రైవేటు భూములు అత్యంత సమస్యగా మారింది. దీంతో కాలం గడుస్తున్నా… మేడ్చల్, శామీర్‌పేట్ వైపు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పనులు మొదలైతే… కనీసం వచ్చే రెండేళ్లలో పూర్తయ్యే పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికీ ప్రాజెక్టు పనులను చేపట్టే వీల్లేకపోవడంతో తమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని నార్త్ సిటీ జనాలు మండిపడుతున్నారు.