సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): పాతనగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ఆస్తుల సేకరణ కత్తిమీద సాముగా మారనుంది. ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎట్టకేలకు ఒక అడుగు ముందు పడింది. ఎంజీబీఎస్ నుంచి చార్మినార్, శాలిబండ, ఫలక్నుమా మీదుగా చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ మేర చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్టు కోసం భారీ ఎత్తున ఆస్తులను సేకరించాల్సి వస్తోంది.
మెట్రో అలైన్మెంట్లో ప్రస్తుతం రోడ్డు విస్తీర్ణం చాలా తక్కువ ఉంది. కొన్ని చోట్ల 30-40, మరికొన్ని చోట్ల 60 ఫీట్ల కంటే ఎక్కువ రోడ్డు మార్గం లేదు. దీంతో మెట్రో మార్గాన్ని సాఫీగా నిర్మించాలంటే 80-100 అడుగుల మేర విస్తరించాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో అతి కష్టం మీద పాతనగరంలో మెట్రో ప్రాజెక్టు కోసం 100 ఆస్తుల సేకరణకు ఇటీవల హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ద్వారా భూసేకరణ నోటిఫికేషన్ను జారీ చేశారు.
మొత్తం 7.5 కి.మీ మేర నిర్మించే పాతనగరం మెట్రో మార్గంలో సుమారు 1100 ఆస్తుల సేకరణ చేపట్టాల్సి ఉన్నదని, ఇందుకోసం రూ.1100 కోట్లు వెచ్చించాల్సి వస్తోందని మెట్రో అధికారులు తెలిపారు. ప్రతిపాదిత మెట్రో మార్గంలో ప్రస్తుతం ఉన్న రోడ్డు విస్తరణను పరిగణలోకి తీసుకొని ఆస్తులను గుర్తించామని, దీంట్లో చిన్న సైజుల్లో ఇండ్లు ఉండటం వల్ల సేకరించాల్సిన ఆస్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో దశల వారీగా 100-200 ఆస్తులకు ఒక నోటిఫికేషన్ చొప్పున జారీ చేయనున్నారు.