హైదరాబాద్ మహా నగరంలో వెస్ట్ జోన్… రియల్- నిర్మాణ రంగాలకు స్వర్గధామం. అందునా ఐటీ కారిడార్‌ను ఆనుకొని ఉన్న భూములంటే బంగారం కంటే విలువైనవి. మరి… అలాంటి భూముల్లో దశాబ్దాల కిందట ప్లాట్లు కొనుగోలు చేసినవారున్నారు. కొందరు పైసా పైసా కూడబెట్టుకొని ఇండ్లు నిర్మించుకున్న వాళ్లూ ఉన్నారు. మరికొందరు భవిష్యత్తు కోసం భూముల్ని కొనుగోలు చేశారు.
ఇప్పుడు ఆ భూములపై ఒక్కసారిగా ’భూసేకరణ’ పిడుగుపడింది. ఒకటీ అరా కాదు! ఏకంగా 439 ఎకరాల్లో అధికారికంగా లావాదేవీలు నిలిచిపోయాయి. రేపో మాపో ఆ భూములన్నీ నిషేధిత జాబితాలోకి ఎక్కనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ ఆ భూముల్ని అధికారికంగా సేకరించి… టీజీఐఐసీకి అప్పగించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే సర్వే నంబర్లతో సహా భూముల్ని గుర్తించిన తహసీల్దార్ నివేదిక మేరకు తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లను నిలిపివేసినట్లు రిజిస్ట్రేషన్ శాఖ చెబుతున్నది. కలెక్టర్ అనుమతి ఇచ్చిన వెంటనే శాశ్వతంగా వాటిని నిషేధిత జాబితాలో చేరుస్తామంటున్నారు.
ఇదీ… రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబరు 127-173, 263-286 పరిధిలోని 439.15 ఎకరాల్లోని భూముల తాజా పరిస్థితి. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు అతి సమీపంలో ఉన్న ఈ అత్యంత విలువైన భూముల్లో ఐటీ పార్కుతో పాటు ఐటీ రంగ ప్రాజెక్టుల కోసం భూముల్ని కేటాయించేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ భూములను సేకరించేందుకు నిర్ణయించింది. భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అంతర్గతంగా కసరత్తు జరుగుతున్నది.
Gopanpally | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/శేరిలింగంపల్లి/మణికొండ, మే 5: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో తెరపైకొచ్చిన భూసేకరణ ప్రక్రియను తాజాగా రేవంత్ సర్కారు పూర్తి చేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపన్‌పల్లిలో ఏకంగా వెయ్యి ఎకరాలను సేకరించేందుకు సుమారు 2003-04 ప్రాంతంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఫార్ములా వన్ కోసం ఈ భూసేకరణ చేపడుతున్నట్లు అప్పట్లో బాబు సర్కారు ప్రకటించినట్లు తెలిసింది. ఆ మేరకు భూసేకరణ నోటిఫికేషన్ కూడా జారీ అయిందని పలువురు చెబుతున్నారు.
అయితే 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు సర్కారు పోయి… వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ మేరకు చంద్రబాబు హయాంలో జారీ అయిన భూసేకరణ, ఇతరత్రా భూములకు సంబంధించిన ఒప్పందాలను వైఎస్ రద్దు చేశారు. అందులో భాగంగా వెయ్యి ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ కూడా రద్దు చేశారు. అందులో ఫార్ములా వన్ కాకుండా ఐటీ పరిశ్రమల ఏర్పాటు కోసం ఆ భూముల్ని సేకరించాలని వైఎస్ నిర్ణయించారు. అయితే గోపన్‌పల్లి పరిధిలో వెయ్యి ఎకరాలు కాకుండా 438 ఎకరాల భూమి లభ్యతను గుర్తించినట్లు తెలిసింది.
ఆ మేరకు 2005లో గోపన్‌పల్లి గ్రామ పరిధిలోని పలు సర్వే నంబర్లలో (71 సర్వే నంబర్లు) 438.15 ఎకరాల సేకరణకు పలు నోటిఫికేషన్లు జారీ చేశారు. అందులో అప్పటికే లేఅవుట్లు అయి ప్లాట్లు కొనుగోలు చేయడంతో రంగనాథనగర్ కాలనీవాసులు హైకోర్టును ఆశ్రయించారు. తాము పైసా పైసా కూడబెట్టుకొని ప్లాట్లు కొనుగోలు చేశామని, దానిని ప్రభుత్వం తీసుకుంటే తామేం కావాలని, న్యాయం చేయాలని కోర్టును అభ్యర్థించారు. అయితే హైకోర్టు వారి విజ్ఞప్తిని తోసిపుచ్చి కాలనీవాసుల పిటిషన్‌ను కొట్టివేసింది.
అనంతరం కాలనీవాసులు సుప్రీం కోర్టును ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరారు. అప్పటి నుంచి ఆ భూసేకరణ నోటిఫికేషన్‌పై న్యాయస్థానంలో కేసు పెండింగ్‌లోనే ఉంది. తీరా… రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల తర్వాత అంటే 2024 ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు ఈ నోటిఫికేషన్‌పై తీర్పునిచ్చింది. పాత నోటిఫికేషన్ చెల్లదని, ప్రభుత్వానికి అవసరమైతే కొత్తగా భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చని సూచించింది. దాదాపు రెండు దశాబ్దాల కిందటి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆసరాగా చేసుకొని రేవంత్ ప్రభుత్వం భారీ భూసేకరణకు రంగం సిద్ధం చేసింది.
వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే 2005లో గోపన్‌పల్లి ప్రాంతం నగరానికి దూరంగా ఉండేది. అయినప్పటికీ భవిష్యత్తులో ఆధారంగా ఉంటాయనే మిగతా నమ్మకంతో సామాన్యులు వేలాది మంది అక్కడ లేఅవుట్లల్లో ప్లాట్లు కొనుగోలు చేశారు. కాలక్రమేణా సామాన్యులు వేలాది మంది పైసా పైసా కూడబెట్టుకొని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ భూముల్లో రంగనాథనగర్, బృందావన్ కాలనీ, ద్వారకాపురి కాలనీ, దుర్గాపూర్ కాలనీలు కూడా ఏర్పడ్డాయి. ఇంకా చాలామంది తమ ప్లాట్ల చుట్టూ ప్రహరీలు నిర్మించుకున్నారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆ భూములను సేకరించేందుకు కసరత్తు మొదలుపెట్టింది.
టీజీఐఐసీ ద్వారా ఆ భూముల్లో ఐటీ పార్కు, సంబంధిత ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు భూసేకరణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడంతో రంగంలోకి దిగిన శేరిలింగంపల్లి తహసిల్దార్ సర్వేనెంబరు 127 నుంచి 173 వరకు, 263 నుంచి 286 వరకు 438.15 ఎకరాల విస్తీర్ణం మేరకు జాబితాను రూపొందించారు. జాబితా మేరకు ఆయా సర్వేనెంబర్లను నిషేధిత జాబితాలో చేర్చాలని గత మార్చి నెలలోనే జిల్లా కలెక్టర్‌కు నివేదికను పంపారు. అదే కాపీని జిల్లా రిజిస్ట్రార్‌కు కూడా పంపారు. దీంతో అప్పటి నుంచి రిజిస్టేష్రన్ల శాఖ ఆ సర్వేనెంబర్లలో భూములపై క్రయ, విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసింది. నిబంధనల మేరకు నిషేధిత జాబితా (22ఎ)లో భూములను చేర్చాలంటే అందుకు జిల్లా కలెక్టర్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.
ఆ మేరకు భూములపై స్పష్టత ఇవ్వాలని రిజిస్టేష్రన్ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. దీంతో రంగారెడ్డి కలెక్టర్ అనుమతినిస్తే అధికారికంగా ఈ 71 సర్వేనెంబర్లలోని 438.15 ఎకరాల భూములు శాశ్వతంగా నిషేధిత జాబితాలోకి వెళ్లనున్నాయి. ఇక… ప్రభుత్వం ఐటీ పార్కు, సంబంధిత ప్రాజెక్టుల భూ కేటాయింపుల కోసం ఈ భూములను సేకరించాల్సి ఉన్నందున త్వరలో భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలున్నాయి. అనంతరం ఆ భూముల్ని టీజీఐఐసీ ఆధీనంలోకి తీసుకోనుంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఐటీ రంగం కోసం లేఅవుట్‌ను రూపొందించి ఆ భూముల్ని వేలం ద్వారా విక్రయిస్తుందా? తనఖా పెట్టి రుణం తీసుకుంటుందా? అనేది వేచి చూడాల్సి ఉంది. కాగా గోపన్‌పల్లి గ్రామ పరిధిలోని పలు సర్వేనెంబర్లలోని భూములను ప్రభుత్వం సేకరించనుందనే సమాచారం నెమ్మదిగా ఆ ప్రాంతంలోని కాలనీలు, భూములు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి తెలుస్తున్నది. దీంతో పెద్ద ఎత్తున ప్రజల్లో ఆందోళన నెలకొంది. అనేక లేఅవుట్లలో వేలాది మంది ఎన్నో ఏండ్ల కిందట ప్లాట్లు కొనుగోలు చేసిన వారూ ఉన్నారు. వీరందరినీ ప్రభుత్వం చేపట్టనున్న భూసేకరణతో ఆందోళనకు గురి చేస్తున్నది.