హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర (Lal Darwaza Bonalu) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ అర్చకులు అభిషేకం నిర్వహించి.. తొలి బోనం సమర్పించారు. ఆశాఢమాసం ఆఖరి ఆదివారం కావడంతో మహంకాళికి (Simhavahini Mahankali) బోనాలు సమర్పించడానికి తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
కాగా, రెండు రోజులపాటు జరుగనున్న జాతరలో నేడు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. రెండో రోజైన సోమవారం రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. తొలిపూజల అనంతరం సింహవాహిని అమ్మవారిని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దర్శించుకున్నారు.
బోనాల ఉత్సవాల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సున్నిత ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయం, అక్కన్న మాదన్న, జియాగూడ సబ్జీమంది, కార్వాన్ దర్బార్ మైసమ్మ, గోల్కొండ తదితర చారిత్రాత్మకమైన ఆలయాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు.