ఆర్కేపురం, ఫిబ్రవరి 24 : మదర్ థెరిస్సా మాటలను స్ఫూర్తిగా తీసుకొని చిన్ననాటి నుంచే సేవాభావాన్ని అలవర్చుకున్నారు. సామాజిక అంశాలపై చైతన్యం చేస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారు. చదువుకొనే సమయంలో స్నేహితులతో కలిసి సేవలు నిర్వహించేవారు. అలాగే జీవితంలో ఉపాధికి కంటి వైద్యురాలిగా విధులు నిర్వహిస్తుంది. దీంతో సమాజానికి ఉపయోగపడాలనుకున్నారు. అన్నార్తులకు బాసటగా నిలిచేందుకు స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. చిన్ననాటి నుంచే కష్టాలను భరించిన కంటి వైద్యురాలు లక్ష్మీప్రసన్న పేదల కష్టాలు చూసి చలించిపోయింది. ఎంతో మంది వైద్యం చేయించుకోలేక మృత్యువాత పడడం, అత్యవసర సమయాల్లో డబ్బులు లేక తమ ఇళ్లు, బంగారు నగలను తెగనమ్ముకుని పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రుల దయనీయ స్థితిని చూశారు. తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలను అడియాసలుగా మారుతున్న తీరుని చూసి తనవంతుగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు.
సమాజంలోని నిరుపేదలు, అనాథ విద్యార్థులు, వృద్ధాశ్రామాలను ఎంపిక చేసుకుని వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, పరీక్ష ప్యాడ్లు , పెన్నులు, క్రీడా, విద్యాసామగ్రిని పంపిణీ చేశారు. కంటి వైద్య క్యాంపులను ఏర్పాటు చేసి ఉచితంగా కంటి పరీక్షలు సైతం నిర్వహిస్తున్నారు. పుట్పాతులపై నిద్రించే వృద్ధులకు దుప్పట్లు అందజేశారు. పేదల సేవే లక్ష్యంగా కృషి చేస్తూ పులువురి మన్ననలు పొందుతున్నారు. ఉత్తమ సేవలు అందించడాన్ని గుర్తించిన వివిధ సంస్థలు లక్ష్మీప్రసన్నకు ఉత్తమ సేవా అవార్డును అందజేశారు.