పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధి కుంట్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి.. తన కుటుంబసభ్యులు, బంధువుల పట్టా భూములకు రోడ్డు కోసం ఏకంగా రూ.20 లక్షల మున్సిపల్ నిధులకు మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసేశారు. ఏడాది గడిచాక పనులు మొదలుపెట్టారు. అదీనూ చెరువు ఎఫ్టీఎల్, ప్రభుత్వ భూమి నుంచి వేసేందుకు సిద్ధమయ్యారు.
పెద్దఅంబర్‌పేటలో జాతీయ రహదారిపై ఉన్న ఓ కన్వెన్షన్‌కు ఆనుకుని రూ.30 లక్షల మున్సిపల్ నిధులతో కన్వెన్షన్ మురుగు వెళ్లేందుకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, దుమ్మురాకుండా సీసీ రోడ్డు వేసుకున్నారు మరో ప్రజాప్రతినిధి. వార్డుకు కేటాయించిన నిధులను పక్క వార్డులో ఉన్న బంధువుల కన్వెన్షన్ వద్ద రోడ్డుకు మళ్లించారు. రూ.10 లక్షలకే టెండర్ అయినప్పటికీ.. మొత్తం రూ.30 లక్షల నిధులతో పనులు పూర్తిచేశారు.
రంగారెడ్డి, డిసెంబర్ 12(నమస్తేతెలంగాణ)/పెద్దఅంబర్‌పేట: పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలోని పలువురు ప్రజాప్రతినిధులు ప్రజల మేలు మరిచి సొంత పనులకు పెద్దపీట వేస్తున్నారు. ప్రజా అవసరాలను స్వేచ్ఛగా పక్కన పెట్టేస్తున్నారు. బంధువర్గానికి అనుకూలంగా, సొంత పనులను చక్కబెట్టేస్తున్నారు. ప్రజలు కట్టిన పన్నుల రూపంలోని నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించకపోతే రూ.కోట్ల ప్రజాధనం ప్రజాప్రతినిధుల సొంత పనులకే ఉపయోగపడే పరిస్థితులున్నాయి.
మున్సిపాలిటీలో కౌన్సిల్ తీర్మానాల ద్వారా అభివృద్ధి పనులు చేపడుతారు. తమకు వచ్చిన నిధులను వార్డు పరిధిలోని కాలనీల్లో సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఉమ్మడి సమస్య ఉంటే దాని పరిష్కారానికి అన్ని వార్డుల ప్రజాప్రతినిధులు కలుస్తారు. ఆయా వార్డుల నిధులను సైతం మళ్లించి ఉమ్మడి సమస్య పరిష్కారానికి కృషి చేయొచ్చు. కానీ, వార్డుకు కేటాయించిన నిధులతో కొందరు ప్రజాప్రతినిధులు.. తమ అనుయాయులు, బంధువులు లేదా సొంతవారికి అవసరమైన చోట ప్రగతి పనులు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సొంత ఫామ్‌హౌజ్‌లకు, నిర్మించబోయే కన్వెన్షన్లకు, వ్యాపార, వాణిజ్య సముదాయాల వద్ద వసతుల కల్పనకు మున్సిపల్ నిధులు వినియోగిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆయా వార్డుల్లో కాలనీలు పెరిగి మౌలిక వసతులు కల్పించాల్సి ఉన్నా.. అవేమీ పట్టకుండా అయినవారికి వసతులు కల్పించేందుకు అందలం వేస్తున్నారు.
ఓ ప్రజాప్రతినిధి తన వార్డుకు కేటాయించిన రూ. 30 లక్షల నిధులను పక్కవార్డుకు మళ్లించారు. పెద్దఅంబర్‌పేట పరిధిలో హైవేకు ఆనుకుని ఉన్న బంధువులకు చెందిన ఓ కన్వెన్షన్‌లోని మురుగు నీరు వెళ్లేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులు చేపట్టారు. కుంట్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి.. పట్టా భూమిలో ఓ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. నిర్మాణానికి హెచ్ఎండీఏ అనుమతి కావాలంటే 40 ఫీట్ల రోడ్డు అవసరం. ఇందుకోసం ఏకంగా కుంట్లూరు పెద్ద చెరువులో నుంచి రోడ్డు వేసేందుకు సిద్ధమైనట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ పనులకు మున్సిపల్ కౌన్సిల్ రూ.20 లక్షల నిధుల మంజూరుకు తీర్మానం చేసింది. దీనిపై స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు చెరువు సర్వే చేపడుతున్నారు.
చెరువులో నుంచే రోడ్డు వేస్తున్నట్టు గుర్తించి, వేసిన రహదారిని తొలగించాలని స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. సర్వే చేసి కుంట్లూరు పెద్ద చెరువుకు హద్దులు నిర్ధారించాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానించిన చాలా పనులకు ఎలాంటి టెండర్లు పిలవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా పనులపై ఫిర్యాదులు వెళ్లినా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ప్రజాప్రతినిధుల వ్యక్తిగత స్వార్థం కోసం జనావాసాలను వదిలి, వారి ప్లాట్లు, ఇతర ఫామ్‌హౌస్‌ల వద్ద మున్సిపల్ నిధులతో సౌకర్యాలు కల్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇండ్లు ఉండి కూడా సమస్యలతో అల్లాడుతున్నామని పలు కాలనీల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.