సిటీబ్యూరో, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ పరిధిలో హైకోర్టు చెరువులను పర్యవేక్షిస్తున్నా… హద్దుల నిర్ధారణ ఆశించినంత వేగంగా ముందుకు సాగడం లేదు. హెచ్ఎండీ పరిధిలోని చెరువుల హద్దుల నిర్ధారణపై గతంలో విచారించిన హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్ 30లోగా నివేదిక ఇవ్వాలని సూచించింది. అయితే నెలవారీ వాయిదాలతో హద్దుల నిర్ధారణ ప్రక్రియలో హెచ్ఎండీఏ కాలయాపన చేస్తూ వస్తోంది.
హెచ్ఎండీఏ పరిధిలో మొత్తం 2,936 చెరువులు ఉన్నాయని, 1,889 చెరువులకు ఇప్పటి వరకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయగా, మిగిలిన 1,047 చెరువులకు సంబంధించి పూర్తిస్థాయి హద్దులను నిర్ధారిస్తూ తాజాగా తుది నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే గడిచిన నాలుగు నెలలుగా ఈ ప్రక్రియను సాగదీస్తున్న హెచ్ఎండీఏ… కోర్టుకు మూడు నెలల గడువు కోరినా హద్దుల నిర్ధారణ అంశాన్ని తుది దశకు తీసుకురాలేకపోయింది.
బఫర్, ఎఫ్టీలపై నత్తనడకన సర్వే..
వాస్తవానికి చెరువుల బఫర్, ఎఫ్టీఎల్పై గత కొంత కాలంగా హెచ్ఎండీఏ సర్వే చేపడుతూనే ఉంది. నత్తనడకన సాగుతున్న హద్దుల నిర్ధారణతో ఇప్పటికే ఎనిమిది నెలలు సమయం గడిచిపోయింది. అయితే ఇప్పటివరకు హెచ్ఎండీఏ హద్దుల నిర్ధారణ ప్రక్రియను పూర్తి చేయలేదు. ఈ క్రమంలో ఇక తామే చెరువుల హద్దుల నిర్ధారణను పర్యవేక్షిస్తామని హైకోర్టు స్పష్టం చేసినా… హెచ్ఎండీ నెలవారీ వాయిదాలతో కాలం గడుపుతోంది.
ఓవైపు అక్రమ నిర్మాలంటూ హైడ్రా, ఇతర శాఖల అధికారులు చెరువుల సమీపంలో ఉండే నివాసితులను భయభ్రాంతులకు గురి చేస్తుంటే.. హద్దుల నిర్ధారణ చేయడంలో ప్రభుత్వం, హెచ్ఎండీ తీవ్ర జాప్యం చేస్తోంది. ఈ క్రమంలో హెచ్ఎండీఏ పరిధిలో చెరువులకు బఫర్, ఎఫ్టీఎల్ జోన్లను నిర్ధారిస్తూ… ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే మరోసారి గడువు కోరినా… హైకోర్టు స్పందించకపోవడంతో… ప్రభుత్వానికి చెంపపెట్టులా మారింది.
నెలవారీ వాయిదాలు..
చెరువుల హద్దుల నిర్ధారణపై నివేదిక ఇచ్చేందుకు తొలుత గతేడాది ఆగస్టు నెలాఖరు నుంచి నవంబర్ వరకుహెచ్ఎండీఏ గడువు కోరింది. గడువులోపు పూర్తిచేయకపోవడంతో మరోసారి డిసెంబర్ నెలాఖరులోగా హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువులకు హద్దులను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా… హెచ్ఎండీఏ నుంచి స్పందన కరువైంది.
ఈ క్రమంలోనే మరో నెల రోజుల వ్యవధి కోరిన హెచ్ఎండీఏ ఆలోపు చెరువుల హద్దుల నిర్ధారణ పూర్తిచేస్తామని స్పష్టం చేసింది. కానీ ఏప్రిల్ 15 దాటిన ఇప్పటివరకు చెరవుల హద్దుల నిర్ధారణలో ఆశించిన పురోగతి లేదనేది స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో హైకోర్టు పర్యవేక్షిస్తున్నా… పనుల్లో పురోగతి లేకపోవడంతో వచ్చే విచారణ సమయానికి ప్రోగ్రెస్ రిపోర్టును ఏ విధంగా అందజేస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇలా గడిచిన ఏడాది కాలంగా హద్దుల నిర్ధారణకు హెచ్ఎండీఏ, సర్కార్ వాయిదాలు కోరుతూనే ఉన్నాయి.
శాఖల మధ్య సమన్వయ లోపం..!
నిజానికి చెరువుల హద్దుల నిర్ధారణ మూడు శాఖల పరిధిలో ఉంటుంది. రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండీఏ శాఖలు ఒకేతాటిపైకి వస్తే గానీ నగరంలో చెరువుల హద్దుల నిర్ధారణ పూర్తిచేసే అవకాశం లేదు. ఇప్పటికే ఈ మూడు శాఖల మధ్య నెలకొని ఉన్న సమన్వయ లోపంతో చెరువు భూములకు రక్షణ లేకుండా చేసిందనే విమర్శలున్నాయి. ఇప్పటికీ వందలాది చెరువులు కబ్జాకోరల్లో ఉన్నా… సంబంధిత మూడు శాఖల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ క్రమంలో హైకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేస్తే తప్ప ప్రభుత్వంలో, అధికారుల్లో చలనం వచ్చేలా లేదు.
ఇండ్లపైకి బుల్డోజర్లను ఎగదోస్తున్న సర్కార్
హెచ్ఎండీఏ లేక్స్ విభాగం ఆలసత్వమో, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమో నగరంలో చెరువులకు హద్దుల నిర్ధారణ పూర్తి కావడం లేదు. చెరువులను పూర్వ వైభవం తీసుకువస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ సర్కార్… జలవనరుల ఆక్రమణల పేరిట పేదల ఇండ్లపైకి బుల్డోజర్లను ఎగదోస్తుంది. అయితే చెరువుల హద్దులను తేల్చే విషయాన్ని మాత్రం గాలికి వదిలేసిందనే విమర్శలున్నాయి.
గత ప్రభుత్వం చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా ఆక్రమణలకు తావులేకుండా చెరువుల బ్యూటిఫికేషన్, కాలుష్య రహిత చర్యలకు ప్రాధాన్యతనిస్తూ హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న పలు చెరువులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దింది. కానీ తదనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన చెరువుల అభివృద్ధిని తప్పుబట్టినట్లుగా… హైడ్రాను ఏర్పాటు చేసి.. కూల్చివేతలకు దిగిందే తప్పా… చెరువుల హద్దుల నిర్ధారణను పూర్తి చేయలేకపోయింది.