శంషాబాద్ రూరల్, అక్టోబర్13: అనుమానాస్పద స్థితిలో ఫాంహౌస్‌లోని నీటి సంప్‌లో పడి ఓ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై భాస్కర్ కథనం ప్రకారం.. రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన సురేశ్ (27) హమిదుల్లానగర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని చల్లాసాని వెంకటేశ్వరరావుకు చెందిన వ్యవసాయ క్షేత్రం (ఫాంహౌస్)లో రోజువారీ కూలీగా పనిచేసి, ఏడాది కిందట పని మానేశాడు.
తిరిగి మూడు నెలలుగా అదే ఫాంహౌస్‌లో కూలీగా చేరాడు. అతడితో పాటు అదే గ్రామానికి చెందిన మల్లేశ్, శ్రీకాంత్ కూడా పని చేస్తున్నారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో ముగ్గురు కలిసి పనులు చేస్తుండగా.. మద్యం మత్తులో ఉన్న సురేశ్ మిగతా ఇరువురితో గొడవ పడ్డాడు. దీంతో వారిద్దరూ దూరంగా వెళ్లి పనులు చేసుకున్నారు. సురేశ్ కూడా పనులు చేసేందుకు దూరంగా వెళ్లి.. సాయంత్రం వరకు రాలేదు. అతడి సెల్‌ఫోన్ మాత్రం కనిపించింది. సెల్‌ఫోన్‌ను కుటుంబ సభ్యులకు ఇచ్చిన అతడి తోటి కూలీలు.. జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో అతడి భార్య శిరీషతో పాటు కొంత మంది గ్రామస్తులు ఫాంహౌస్‌కు చేరుకొని.. తోట మొత్తం గాలించారు.
ఎక్కడ అతడి జాడ కనిపించలేదు. ఆదివారం ఉదయం మరోసారి తోటలో గాలిస్తుండగా.. ఫాంహౌస్‌లో ఉన్న నీటి సంప్‌లో సురేశ్ మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నగరంలోని ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతి చెందిన సురేశ్‌కు భార్య శిరీషతో పాటు నాలుగు సంవత్సరాల కొడుకు ఉన్నాడు. సురేశ్ కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు. తోట యజమాని న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు