కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 4: కూకట్పల్లి నియోజకవర్గంలో గడిచిన పదేండ్ల కాలంలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధిని సాధించింది. విభిన్న దేశాలు, రాష్ర్టాల ప్రజలకు నిలయమైన కూకట్పల్లి అనతికాలంలో శరవేగంగా వృద్ధిని సాధించగా.. పెరిగిన జనాభాకనుగుణంగా కనీస మౌలిక వసతులు కల్పించడంలో గత పాలకులు విఫలమయ్యారు. సీఎం కేసీఆర్ పాలనలో మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పట్టుదల, నిర్వీరామ కృషి ఫలితంగా నేడు నగరంలో ఏ ఎక్కడాలేని విధంగా కూకట్పల్లి అభివృద్ధిని సాధించింది. ప్రజలకు మౌలిక వసతుల కల్పన, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, మెరుగైన రోడ్ల వ్యవస్థ, నిరంతరంగా విద్యుత్ సరఫరా, సమృద్ధిగా తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థల ఆధునీకరణ, నాలాల అభివృద్ధి, చెరువుల సుందరీకరణ, పార్కులు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధి, మల్టీపర్పస్ ఫంక్షన్‌హాళ్లు, బస్తీ దవాఖానల ఏర్పాటుతో అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించింది.
ట్రాఫిక్ సమస్యలకు విముక్తి..
హైటెక్‌సిటీ సమాంతరంగా ఉన్న కూకట్పల్లి పరిసర ప్రాంతాలన్నీ ట్రాఫిక్ సమస్యలకు కేంద్రంగా ఉండేది. కేపీహెచ్‌బీ కాలనీ హైటెక్‌సిటీ మార్గంలోని రాజీవ్‌గాంధీ (ఫోరం సుజాన మాల్) చౌరస్తాలో రూ.84 కోట్లతో ఫ్లై ఓవర్ బ్రిడ్జి, కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్ సమీపంలో రూ.64 కోట్లతో రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జి, కైత్లాపూర్, మాదాపూర్ మార్గంలో రూ.135 కోట్లతో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి, బాలానగర్ నర్సాపూర్ చౌరస్తా నుంచి సనత్‌నగర్ మార్గంలో రూ.40 కోట్లతో ఫ్లై ఓవర్ బ్రిడ్జి, ఫతేనగర్, బేగంపేట రోడ్డులో రూ.60 కోట్లతో ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను నిర్మించారు. ఎన్నో ఏండ్లుగా ట్రాఫిక్ కష్టాలకు నిలయమైన బాలానగర్ నర్సాపూర్ చౌరస్తాలో రూ.390 కోట్లతో నిర్మించి ఫ్లై ఓవర్ బ్రిడ్జి పూర్తి కావడంతో వాహనదారులందరికీ ఎంతోమేలు జరిగింది.
పార్కులు.. క్రీడా ప్రాంగణాలు..
నియోజకవర్గంలో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను పార్కులుగా, క్రీడా ప్రాంగణాలుగా అభివృద్ధి చేశారు. కేపీహెచ్‌బీ కాలనీ మొదటి రోడ్డులో జీహెచ్ఎంసీ ప్లే పార్కు, కేపీహెచ్‌బీ కాలనీ 1, 2వ రోడ్డుల్లో పార్కు, కాలనీ 5వ ఫేజ్‌లో ఐదెకరాల స్థలంలో కేబీఆర్ పార్కు తరహాలో పార్కుతో పాటు క్రికెట్ స్టేడియం, వసంతనగర్‌లో బతుకమ్మ పార్కు, కూకట్పల్లి, బాలానగర్, బోయిన్పల్లి, ఫతేనగర్, అల్లాపూర్‌లలో ప్రత్కేకంగా పార్కులను అందుబాటులోకి తెచ్చారు.
మోడల్ రైతుబజార్.. ఫిష్ మార్కెట్..
కేపీహెచ్‌బీ కాలనీలో రూ.30 కోట్లతో సకల వసతులతో కూడిన మోడల్ రైతుబజార్‌ను అభివృద్ధి చేశారు. రూ.9 కోట్లతో మోడల్ ఫిష్ మార్కెట్, కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేజ్, అల్లాపూర్ పర్వత్‌నగర్‌లో కలిపి రెండుచోట్ల మల్టీపర్పస్ ఫంక్షన్‌హాళ్లను అందుబాటులోకి తెచ్చారు. కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్‌లోని కైలాసవాసం, క్రిస్టియన్, ముస్లిం శ్మశానవాటిక, బేగంపేటలోని శ్మశానవాటికలను ఆదర్శవంతంగా అభివృద్ధి చేశారు.
ఎమ్మెల్యే సొంత నిధులతో..
కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు సొంత నిధులతో గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా 250 మంది దివ్యాంగులకు ద్విచక్ర వాహనాల పంపిణీ, ప్రజలకు అందుబాటులో రెండు ఉచిత అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగులతోపాటు నోట్‌బుక్స్, కంపాస్ బాక్సులు, డిక్షనరీతో కూడిన కిట్టును అందించారు.
మెరుగైన మౌలిక వసతులు..
ఇరువై ఏండ్ల కిందట సాదాసీదాగా ఉండే కూకట్‌పల్లిలో వివిధ రాష్ర్టాలు, దేశాలకు చెందిన ప్రజలకు నివాస కేంద్రంగా మారింది. కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట, బోయిన్పల్లి, అల్లాపూర్, ఫతేనగర్, బాలానగర్, కూకట్పల్లి ప్రాంతాలలో ప్రజలు నివాసాలు ఏర్పర్చుకోగా దానికనుగుణంగా మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. కూకట్పల్లి నియోజకవర్గంలో 9 రిజర్వాయర్లతో 45లక్షల గ్యాలర్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడం, రూ.390 కోట్లతో 375 కి.మి. పైప్‌లైన్ వ్యవస్థను పునరుద్ధరించడం, ప్రతిరోజూ 30 ఎంజీడీల తాగునీటిని సరఫరా చేస్తుండటంతో నేడు తాగునీటి కష్టాలన్నీ మాయమయ్యాయి. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా, ప్రతి కాలనీ, బస్తీలో డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించడం, చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికాగా కంచెలు ఏర్పాటు, మురుగునీరు చేరకుండా ఎస్టీపీలను ఏర్పాటు చేశారు.
నేడు కూకట్‌పల్లిలో ప్రగతి నివేదన సభహాజరుకానున్న మంత్రి కేటీఆర్..
కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రగతి నివేదన సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. గురువారం సాయంత్రం 4 గంటలకు కేపీహెచ్‌బీ కాలనీ 9వ ఫేజ్‌లో జరిగే ఈ ప్రగతి నివేదన సభకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. బాలాజీనగర్ డివిజన్లోని రంగథాముని (ఐడీఎల్) చెరువుగట్టుపై రూ.9 కోట్లతో అభివృద్ధి చేసిన రంగధాముని ఫ్రంట్లేక్ పార్కును, చెరువు సుందరీకరణ, సీవరేజ్ డ్రైన్ పైప్‌లైన్, ముళ్లకత్వ చెరువు వరకు రూ.12 కోట్లతో చేపట్టనున్న సీవరేజ్ పైప్‌లైన్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాన చేయనున్నట్లు తెలిపారు.
పేదలకు సంక్షేమ ఫలాలు
కూకట్పల్లి నియోజకవర్గంలో 72వేల కుటుంబాలు ఆహార భద్రత కార్డులు, 42వేల మందికి ఆసరా పింఛన్లు, 15వేల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అందింది. ఐదువేల మంది సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయాన్ని పొందారు. 12 బస్తీ దవాఖానల ద్వారా నిత్యం వైద్య సేవలు అందుతున్నాయి.
ప్రజలకు నిత్యం అందుబాటులో..
కూకట్‌పల్లిలో పుట్టి పెరిగిన నాకు ప్రతి కాలనీ, బస్తీ సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్నది. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే తాగునీరు, కరెంటు, డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడానికి దృష్టి సారించాను. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల సహకారంతో అభివృద్ధి పనులు చేశాను. మూడు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలన్నీ పరిష్కరించాను. రిజర్వాయర్ల నిర్మాణం, పైప్లైన్ల పునరుద్ధరణతో తాగునీటి కష్టాలు తీరాయి. ఖాళీ స్థలాలను పార్కులుగా, క్రీడా ప్రాంగణాలుగా తీర్చిదిద్దగా.. ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకున్నారు. కేపీహెచ్‌బీ కాలనీలో వేలాది కోట్ల విలువైన హౌసింగ్‌బోర్డుకు చెందిన స్థలాలను పార్కుల కోసం, క్రీడా ప్రాంగణాల నిర్మాణం కోసం కేటాయించేలా కృషి చేశాను. పేదలందరికీ సంక్షమ ఫలాలు అందించడం, ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నా. ప్రజల కష్టాలను నేరుగా నాకు చెప్పుకునే అవకాశం కల్పించాను. సీఎం కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి కండ్లముంటే కనబడుతుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో సైతం భారీ మెజార్టీతో విజయం సాధిస్తానన్న నమ్మకముంది.
– మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్యే, కూకట్పల్లి నియోజకవర్గం