Madhavaram Krishna Rao | అల్లాపూర్, ఆగస్టు 30: నలభయ్యేండ్లుగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న నిరుపేదల జోలికొస్తే సహించేది లేదని, ప్రాణాలు ఇచ్చి అయినా వా రి ఇండ్లు కాపాడుకుంటానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బస్తీవాసులకు హామీ ఇచ్చారు. సున్నం చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న పద్మావతినగర్‌లో హైడ్రా నోటీసులు ఇచ్చిన కుటుంబాలను స్థానిక కార్పొరేటర్ సబీహాబేగంతో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే కలిశారు.
కూలీ పని చేసుకుని పైసా పైపా పోగు చేసుకుని స్థలాలు కొని రేకుల ఇండ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడొచ్చి అధికారులు నోటీసులు ఇవ్వడంతో కంటి మీద కునుకు లేకుండా పోయిందని బస్తీవాసులు ఎమ్మెల్యేకు తమ గోడును వెల్లబుచ్చారు. దయ చేసి తమ ఇండ్లు కా పాడాలని, ఇండ్లు కూల్చేస్తే తమకు చావే దిక్కని బాధితులు ఎమ్మెల్యే వద్ద రోధించారు. వారి బాధను విన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ, 40 ఏండ్ల క్రితం ఇండ్లు కట్టుకొని జీవనం సాగిస్తున్న వారికి హైడ్రా ఇప్పడు నోటీసులు ఇవ్వ డం ఏంటని ప్రశ్నించారు.
కూలీ పని చేసుకుని బతికే నిరుపేదలపై హైడ్రా అధికారులు తమ ప్రతాపం చూపడంతో భయబ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బాధితులకు ఎమ్మెల్యే భరోసానిచ్చా రు. చెరువులు, కుంటలు కబ్జా చేసిన బడా బాబులు భవంతులను నిర్మించుకుంటే వాటిని కూల్చడం మర్చిపోయి, పేదలు నివసించే ప్రాంతాల్లో కూల్చివేతలు జరపడం సరికాదన్నారు. కొంద రు కాంగ్రెస్ నాయకులు హైడ్రా అధికారులు, లీడర్లతో ఫొటోలు దిగి స్థానికంగా బిల్డర్లను బెదిరించి రూ.లక్షలు వసూళ్లు చేస్తున్నారని, అలాంటి వారి పై చర్యలు తీసుకోవాలని కోరారు.