Court verdict: హైదరాబాద్ నగరంలో పింకి అనే గర్భిణిని అత్యంత దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్ దగ్గర పడేసిన నలుగురు నిందితులకు కూకట్పల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది. నిందితులను చనిపోయేవరకు ఖైదీలుగా ఉంచాలని కూకట్పల్లి 6వ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి శుక్రవారం తీర్పు చెప్పారు. నిందితులు పింకిని కిరాతకంగా హతమార్చి మృతదేహన్ని ఏడు ముక్కలుగా కోశారు. అనంతరం శరీర భాగాలను గోనెసంచిలో మూటగట్టి బొటానికల్ గార్డెన్ దగ్గర పడేశారు. మృతురాలు బీహార్‌కు చెందిన యువతిగా పోలీసుల విచారణలో తేలింది.
వివరాల్లోకి వెళ్తే.. 2018 జనవరి 29న హైదరాబాద్ కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్ సమీపంలో 7 నెలల గర్భిణి పింకి హత్యకు గురైంది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె స్వస్థలం బీహార్ రాష్ట్రం బంకా జిల్లాలోని మోహునా మాల్తీగా గుర్తించారు. నిందితులు మమతా ఝా, అనిల్ ఝా, వారి కొడుకు అమరకాంత్ ఝా, వికాస్ కశ్యప్‌లపై పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
పింకి 15 ఏళ్ల క్రితం దినేశ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని 2017లో అతడిని వదిలేసింది. అనంతరం వికాస్ కశ్యప్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నది. ఆ తర్వాత వికాస్ కశ్యప్‌కు మమతా ఝా అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో మమతా ఝా తన భర్త, కొడుకుతో కలిసి హైదరాబాద్‌కు వచ్చింది. వికాస్ కశ్యప్ కూడా వారితోపాటే నగరానికి వచ్చి ఉంటున్నాడు. దాంతో భర్త జాడ వెతుక్కుంటూ పింకి కూడా హైదరాబాద్‌కు చేరింది.
అయితే, మమతా ఝాతో వికాస్ కశ్యప్ వివాహేతర సంబంధాన్ని గమనించిన పింకి అతడిని నిలదీసింది. అప్పటికే 7 నెలల గర్భవతి అయిన ఆమె తనకు అన్యాయం చేయవద్దని వేడుకుంది. దాంతో తన వివాహేతర సంబంధానికి పింకి అడ్డుగా ఉందని భావించిన వికాస్ కశ్యప్ పింకిని దారుణంగా కొట్టి చంపేశాడు. అనంతరం మమతా ఝా కుటుంబంతో కలిసి మృతదేహాన్ని ముక్కలుగా కోసి బొటానికల్ గార్డెన్ దగ్గర పడేశాడు. 2018 జనవరి 18న ఈ దారుణ హత్యోదంతం చోటుచేసుకుంది.