సిటీబ్యూరో/మల్కాజ్గిరి/నాచారం, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ హైదరాబాద్‌లో హిల్ట్ పాలసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదలాయించేందుకు చేస్తున్న కుట్రను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ పోరుబాటను ఉధృతం చేసింది. బుధవారం హైదరాబాద్ నగరంలోని రెండు క్లస్టర్లతో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం నిరసన ప్రదర్శన చేపట్టింది. శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి బృందం మౌలాలి ఐలా పారిశ్రామికవాడలో, నాచారం మల్లాపూర్ పారిశ్రామికవాడలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డితో కూడిన ప్రతినిధుల బృందం పర్యటించింది. తెలంగాణను దోచుకుంటున్న దండుపాళ్యం ముఠా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. హిల్ట్ పాలసీని రద్దు చేయాలని నినాదాలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను మధుసూదనాచారి, జగదీశ్‌రెడ్డిలు ఈ సందర్భంగా ఖండించారు. తెలంగాణ ప్రయోజనాలను నిర్వీర్యం చేసేందుకు రేవంత్‌రెడ్డి కుట్రలు పన్నారని మధుసూదనాచారి అన్నారు. జేబులు నింపుకొనేందుకు , కాసుల కోసమే హిల్ట్ పాలసీని తీసుకువచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేది దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా మిగులుతుందన్నారు. పారిశ్రామికవాడలను 8 క్లస్టర్లుగా విభజించిన బీఆర్ఎస్ పార్టీ గురువారం ఆరు క్లస్టర్లలో పర్యటించనున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాశమైలారం పారిశ్రామికవాడలో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర క్లస్టర్లలో పార్టీ ప్రజాప్రతినిధులు పర్యటిస్తారు.

కుట్రలను తిప్పికొడతాం
లక్షల కోట్ల పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పే కుట్ర జరుగుతున్నది. 5 లక్షల కోట్ల అవినీతికి తెరలేపే విధంగా పాలసీ ఉన్నట్లు కనిపిస్తున్నది. నగరంలో పరిశ్రమల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసింది. మల్కాజిగిరి నియోజకవర్గంలో లైబ్రరీ కోసం నిధులు మంజూరు చేశాం. లైబ్రరీని ఏర్పాటు చేయాలని అధికారులను కోరితే స్థలం లేదని చెప్పారు. అయితే ఇలాంటి స్థలాలను ప్రజా అవసరాలకు కేటాయించాల్సిన ప్రభుత్వం, అవినీతికి తెరతీస్తున్నది. కోట్ల విలువ చేసే భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్రలను తిప్పికొడతాం.
– మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, మల్కాజిగిరి
ఒక్క ఉప్పల్లోనే 3వేల ఎకరాలు
ఉప్పల్ నియూజకవర్గంలో సుమారు 3 వేల ఎకఉప్పల్ నియూజకవర్గంలో సుమారు 3 వేల ఎకరాల్లో నాచారం, మల్లాపూర్, చర్లపల్లి, కుషాయిగూడ, ఉప్పల్ పారిశ్రామిక వాడలు విస్తరించి ఉన్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి ఎంతో మంది ఈ ప్రాంతంలో జీవనోపాధి పొందుతున్నారు. నాచారంలోని ఎక్క షాహి ఎక్స్‌పోర్టు పరిశ్రమలోనే 2వేల మంది మహిళలు టైలరింగ్ చేసి జీవనోపాధి పొందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీ ద్వారా పరిశ్రమలను తరలిస్తే కొన్ని వేలమంది పేద , మధ్య తరగతి ప్రజలు రోడ్డున పడతారు. హిల్ట్ పాలసీని విరమించుకోవాలి.
– బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే, ఉప్పల్
ఇళ్ల స్థలాలు కేటాయించండి
ప్రజా అవసరాల కోసం స్థలాలు కేటాయించాలి. నగరంలో పేద, మధ్యతరగతి ప్రజలకు డబుల్బెడ్రూం ఇండ్ల కోసం స్థలాలు కేటాయించాలి. ప్రభుత్వ భూములను అమ్మడం దారుణం. ప్రజల కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం. పార్కులు, విద్యాసంస్థలు, ఆటస్థలాలు, గ్రేవ్‌యార్డులు తదితర ప్రజల కోసం ఉపయోగపడే విధంగా స్థలాలను సద్వినియోగం చేయాలి. ప్రజల తరఫున పోరాటం చేస్తాం.
– శాంతి, కార్పొరేటర్, అల్వాల్
దోచుకునేందుకే హిల్ట్ పాలసీ
భూములు దోచుకునేందుకు కాంగ్రెస్ సర్కారు హిల్ట్ పాలసీని తీసుకొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తాం. భూములను విక్రయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కార్మికులకు, పారిశ్రామికవేత్తలకు అన్యాయం చేయవద్దు. ప్రజా అవసరాలకు స్థలాలు కేటాయించాలి.
– సునీతా రాముయాదవ్, గౌతంనగర్ కార్పొరేటర్