మైలార్‌దేవ్‌పల్లి, ఏప్రిల్ 20: తెలంగాణ ప్రజలకు రక్షణ కవచమే గులాబీ జెండా అని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమమంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అడుగడుగునా ప్రజలను మోసం చేస్తూ కాలం వెల్లదీస్తున్నదని మండిపడ్డారు. ‘కాంగ్రెస్‌కు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి పైసలు లేవంట.. కానీ మూసీకి మాత్రం లక్ష కోట్లు ఖర్చు చేస్తారంటా.. వీరి అబద్ధపు మాటలు వింటుంటే ప్రజలకే చిరాకు వస్తున్నది’ అని అన్నారు.
తెలంగాణ భవన్లో ఆదివారం కేటీఆర్ సమక్షంలో అత్తాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వనం శ్రీరామ్‌రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జీ కార్తిక్రెడ్డిలతో కలిసి పార్టీలో చేరిన వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
420 హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇండ్లు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లల ఉంటే ముట్టుకోరని, హైడ్రా పేరుతో పేదల ఇండ్లు మాత్రం కూల్చుతున్నారన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మతం పేరుతో ఓట్లు అడగడమే బీజేపీ పనిగా మారిందన్నారు.
ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అప్పారెడ్డి ముఖేశ్, పుప్పాల లక్ష్మణ్, అత్తాపూర్మాజీ కార్పొరేటర్ విజయ జంగయ్య, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.