రంగారెడ్డి, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ), బడంగ్‌పేట/కందుకూరు ఫిబ్రవరి 18: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాతో అటు హైదరాబాద్ నగరంలోనూ, ఇటు రంగారెడ్డి జిల్లాలోనూ రియల్ ఎస్టేట్‌వ్యాపారం పూర్తిగా కుదేలైందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆమనగల్లు పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రైతుదీక్షకు కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, గువ్వల బాలరాజ్యాదవ్, బీఆర్ ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పటోళ్ల కార్తీక్ రెడ్డి, మాజీడిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, రామిడి రాంరెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రైతు దీక్షలో కేటీఆర్ మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి సోదరులు పెద్ద ఎత్తున భూదందాలు సాగిస్తున్నారని వారు మాత్రమే రియల్ ఎస్టేట్‌వ్యాపారం చేసి బాగుపడ్డారని మిగతావారంతా పూర్తిగా నష్టపోయారని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల పేరుతో వారు వేల ఎకరాల్లో భూములు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు.
కాగా, రైతు దీక్ష సభ నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గ అంతా గులాబీమయమైంది. ఆమనగల్ లో నిర్వహించిన రైతు ధర్నాకు మహేశ్వరం నుంచి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. తుక్కుగూడ దగ్గర సబితా ఇంద్రారెడ్డి ఏర్పాటు చేయించిన గులాబీ జెండాను కేటీఆర్ ఎగరవేశారు. బీఆర్ఎస్ నేతలు భారీ గజమాలతో కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డిలను ఘనంగా సత్కరించారు. జెసిబీ ల సహాయంతో దారి వెంట కేటీఆర్ పై గులాబీ పూల వర్షం కురిపించారు.