సిటీబ్యూరో , మే 17 (నమస్తే తెలంగాణ) /ఎల్బీనగర్ : హైదరాబాద్ నగరం తిరిగి అభివృద్ధి పట్టాలెక్కాలంటే కేసీఆర్ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని తీసుకురావడమే ఏకైక మార్గమని ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో జరిగిన‘ నా బూత్ – నా బాధ్యత’ అనే ప్రత్యేక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమానికి సంబంధించిన ప్రోగ్రాంలో కేటీఆర్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లతో జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్ పలు అంశాలపైన వివరంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరం పూర్తిగా సంక్షోభంలోకి జారుకున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. కనీస పౌర సదుపాయాలు కూడా నిర్వహించలేని దుస్థితిలోకి నగరం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి వృథా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఉన్న నగరాన్ని వదిలేసి, నిర్వహణ చేయడం చేతగాని రేవంత్‌రెడ్డి, ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారాంతాల్లో, సెలవు రోజుల్లో బుల్డోజర్లను పేదల ఇండ్ల పైకి పంపిస్తూ రెండున్నర సంవత్సరాల పాటు వేలాది మంది ఇండ్లను కూల్చివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2028లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల మంచినీళ్లు ఇచ్చేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటలు తాగునీరు అందించే వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. కృష్ణా, గోదావరి జలాలను తీసుకువచ్చి ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ అందించిన ఘనత కేసీఆర్‌దే అని గుర్తు చేశారు. 24 గంటల కరెంట్‌ను అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు.

ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపడితే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఒకటంటే ఒక ఇల్లు కూడా కట్టలేదని కేటీఆర్ విమర్శించారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చొరవతో ఎల్బీనగర్ వేల కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గం రూపురేఖలను మార్చారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ పేదలకు అండగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన విషయాలను, గతంలో ఉన్న ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, డబుల్ బెడ్రూం ఇండ్లు వంటి అనేక అంశాల గురించి ప్రస్తుతం ప్రజలకి తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నదని కేటీఆర్ వివరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రతి సంక్షేమ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఆపివేసిందని, మరోవైపు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు ఏ ఒక కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. రెండున్నర సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి శూన్యమని కేటీఆర్ విమర్శించారు. గత ప్రభుత్వం టిమ్స్ పేరుతో ఆస్పత్రుల నిర్మాణానికి చర్యలు చేపడితే… ప్రస్తుతం గడ్డిఅన్నారంలో జరుగుతున్న నిర్మాణ పనులు పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. త్వరలోనే ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టిమ్స్ ఆస్పత్రి భవన నిర్మాణంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా భారీ ధర్నాను చేపడతామని కేటీఆర్ చెప్పారు.
ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల వడపోత కార్యక్రమానికి సంబంధించి పార్టీ తరపున గుర్తించిన బూత్ లెవెల్ ఏజెంట్లు నిబద్ధతతో, పట్టుదలగా పని చేయాలని కేటీఆర్ సూచించారు.. తమ పరిధిలో ఉన్న… తమ బూత్ పరిధిలో ఉన్న ప్రతి ఒక ఇంటికి వెళ్లి ఎవరి ఓటు కూడా అన్యాయంగా తొలగించబడకుండా చూడాలని సూచించారు. కచ్చితంగా హైదరాబాద్ నగరంలో రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఘనవిజయం సాధిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేసిన కేటీఆర్..ఆ దిశగా ప్రతి ఒక కార్యకర్త ఇప్పటి నుంచే కృషి చేయాలన్నారు.
ఇందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టడంతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రజలను జాగృతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు పల్లె రవి కుమార్ గౌడ్, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉండి, సత్ప్రవర్తన కలిగిన మంచి నాయకుడినే ప్రజలు ఆదరిస్తారు. సమస్యలపై స్పందించడమే కాకుండా, వ్యక్తిగత ప్రవర్తన కూడా నాయకుడి ఎదుగుదలలో కీలకం. పార్టీ నిర్మాణంలో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి. భవిష్యత్‌లో అందరికీ అవకాశాలు వస్తాయి. నిబద్ధత, చిత్తశుద్ధితో పనిచేసేవారికి ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రత్యక్షంగా, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి.
– ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి