హైదరాబాద్, జనవరి 11 (నమస్తేతెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి శ్రేణులు సంఘటితంగా పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. గడపగడపకూ వెళ్లి రెండేండ్లలో కాంగ్రెస్ చేసిన మోసాలను ఎండగట్టాలన్నారు. రాత్రింబవళ్లు శ్రమించి బల్దియాలు, జడ్పీలపై గులాబీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డి ఆధ్వర్యంలో బండ్లగూడ మాజీ మేయర్ శ్రీలతాప్రేమ్గౌడ్, వారి అనుచరులు బీఆర్ఎస్లో చేరారు. వీరికి కేటీఆర్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ పాలనలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు అభివృద్ధి కనుమరుగైందన్నారు.
ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి వారిని నట్టేటా ముంచారని కేటీఆర్ అన్నారు. హామీలు అమలు చేయాలని అడిగితే పోలీసులతో వారిపై దాడి చేయించడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు పెట్టి అన్ని సిద్ధం చేస్తే సీఎం మాత్రం తన ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ‘నిజంగా ముఖ్యమంత్రి చెబుతున్నది నిజమే అయితే ఇటీవల అశోక్‌నగర్‌లో షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు పోలీసుల బలగాల మధ్య ఎందుకువెళ్లాల్సి వచ్చింది? నిరుద్యోగులపై లాఠీలు ఝుళిపించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది..?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. భర్తీ చేసిన ఉద్యోగాల లెక్కలు పక్కా కాదని, పచ్చి అబద్ధాలని అందుకే నిరుద్యోగ బిడ్డలపై కాంగ్రెస్ సర్కారు దమనకాండకు దిగుతున్నదని విమర్శించారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి కండ్లు తెరిచి ప్రజలకిచ్చిన హామీలపై దృష్టిపెట్టాలన్నారు.