మహానగర సిగలో మరో మణిహారం చేరింది. అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటైన ఉప్పల్ చౌరస్తాలో అత్యద్భుతంగా రూపుదిద్దుకున్న కాలినడక వంతెన అందుబాటులోకి వచ్చింది. కూడలిలో రూ.25 కోట్లతో నిర్మించిన ఈ స్కైవాక్‌ను సోమవారం మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ప్రారంభించారు. అలాగే ఉప్పల్ భగాయత్‌లోని శిల్పారామంలో కన్వెన్షన్ సెంటర్‌ను సైతం ప్రారంభించారు. 8 చోట్ల లిఫ్ట్‌లు, 4 ఎస్కలేటర్స్, 6 చోట్ల మెట్ల సౌకర్యాన్ని కల్పించిన ఈ ఆకాశవంతెన వాడుకలోకి రావడంతో పాదచారులు రోడ్డు దాటే అవసరం లేకుండానే.. సులువుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఆధునిక హంగులతో నిర్మించిన ఈ ఐకానిక్ వంతెనను చూసి మురిసిపోతున్నారు. స్కైవాక్ చిత్రాలు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.
సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : పాదచారికి ఆహ్లాదాన్నిచ్చే ఆధునిక మార్గం ఉప్పల్ చౌరస్తాలో అత్యాధునిక స్కైవాక్ఉప్పల్ స్కైవాక్.. ఎక్కడ చూసినా ఇప్పుడు దీని గురించే చర్చంతా. డ్రోన్ షాట్‌తో తీసిన స్కైవాక్ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్సెట్గా మారాయి. పగటి వేళల్లో, రాత్రి వేళల్లో తీసిన వేర్వేరు ఫొటోలు నగరవాసుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. అందంగా కనబడుతున్న డ్రోన్ షాట్ ఫొటోలను కొందరు వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోగా, మరి కొందరు ట్విట్టర్లో షేర్ చేస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నగరంలోనే అత్యంత రద్దీతో కూడిన చౌరస్తాగా పేరొందిన ఉప్పల్ రింగు రోడ్డులో 4 రోడ్లను ఒకేసారి కలుపుతూ ఆకట్టుకునే శైలిలో ఉప్పల్ స్కైవాక్‌ను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నిర్మించింది. రూ.25 కోట్ల వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వలయాకారపు స్కై వాక్‌ను ఐటీ శాఖ మంత్రి కే.టీ. రామారావు సోమవారం ప్రారంభించారు. ఉదయం ప్రారంభమైన స్కై వాక్పైకి పాదాచారులు పెద్ద సంఖ్యలో ఎక్కి చుట్టూ తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ఒకవైపు హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి, మరో వైపు సికింద్రాబాద్-ఎల్బీనగర్ ఇన్నర్ రింగు రోడ్డుల మీదుగా అత్యంత విశాలంగా ఒకేసారి 660 మీటర్ల పొడవుతో, 3,4,5 మీటర్ల వెడల్పుతో వలయాకారంలో నిర్మించిన స్కై వాక్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. మైల్డ్ స్టీల్, ఫ్యాబ్రిక్ రూపింగ్‌తో ఆధునిక డిజైన్లతో నిర్మించారు. సిటీ బస్టాపులు, జిల్లాలకు వెళ్లే బస్టాప్‌కు వెళ్లాలన్నా, బస్సు దిగిన తర్వాత మెట్రో స్టేషన్ వెళ్లాలన్నా…., అదేవిధంగా విద్యాసంస్థలు, ఇతర వ్యాపార సంస్థలు.. ఇలా ఎటు వెళ్లాలన్నా కొత్తగా నిర్మించిన స్కైవాక్ పాదచారులకు అత్యంత సౌకర్యవంతంగా మారింది.
నడిరోడ్డుపై ఐకానిక్ ప్రాజెక్టు..
విశ్వనగరంగా మారిన హైదరాబాద్ మహానగరంలో రోడ్లపై ఒకవైపు నుంచి ఇంకో వైపు దాటాలంటేనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితిని నగర వాసులకు శాశ్వతంగా దూరం చేసేలా ఉప్పల్ చౌరస్తాలో అత్యాధునిక శైలిలో 6 చోట్ల రోడ్ల మీదకు దిగేందుకు వీలుగా వలయాకారంలో ఆకట్టుకునే శైలిలో ఉప్పల్ స్కైవాక్‌ను హెచ్ఎండీఏ నిర్మించింది. కేవలం రోడ్డు దాటడం కోసం కాకుండా నడక దారిలో ఆహ్లాదాన్ని పొందేలా, చుట్టూ ఉన్న ప్రదేశాలను వీక్షిస్తూ ముందుకు సాగిపోయేలా దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసి నిర్మించారు. రోడ్డు దాటేటప్పుడు పాదచారులు ప్రమాదాల బారిన పడకుండా, ఎక్కువ అలసట లేకుండా సాఫీగా తాము చేరుకోవాల్సిన గమ్యస్థానాన్ని చేరుకునేలా స్కైవాక్ గమ్య స్థానాలను నిర్మించారు. బస్టాపులతో పాటు ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయం, పోలీస్‌స్టేషన్… వంటి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు వీలుగా మెట్ల మార్గాలు, లిప్టులను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఎక్కడా ఏర్పాటు చేయని విధంగా నిర్మించిన ఉప్పల్ స్కైవాక్ ఐకానిక్ ప్రాజెక్టుగా నిలవనున్నది. అత్యాధునిక శైలిలో నిర్మించిన స్కైవాక్పై నిలబడి సెల్ఫీ ఫొటోలు తీసుకుంటూ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాదాచారులు గడిపారు. ఉప్పల్ మెట్రో స్టేషన్లో దిగిన వారంతా స్కైవాక్ మీదుగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ వైపు చేరుకొని తమ అనుభూతిని వ్యక్తం చేశారు. స్కైవాక్‌తో ఉప్పల్ రింగు రోడ్డుకు సరికొత్త శోభ వచ్చిందంటూ పలువురు నవ్వుతూ తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. యువతీ యువకులే కాకుండా పిల్లలు, వృద్దులు సైతం స్కైవాక్ పైకి చేరుకునేందుకు లిప్టులు ఉండడంతో చాలా మంది మొదటి సారి స్కైవాక్ పైకి ఎక్కి చుట్టూ కలియ తిరుగుతూ గడిపారు.
రూ.10 కోట్లతో శిల్పారామం కన్వెన్షన్ హాలు..
ఉప్పల్‌కు సరికొత్త శోభను తీసుకువచ్చేలా మెట్రో డిపో సమీపంలోని ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో శిల్పారామంను ఏర్పాటు చేశారు. హెచ్ఎండీఏ ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలో ఇప్పటికే శిల్పారామానికి సంబంధించిన పలు కార్యకలాపాలు కొనసాగుతుండగా, సమావేశాల కోసం ప్రత్యేకంగా శిల్పారామం కన్వెన్షన్ హాలును అత్యాధునిక శైలిలో నిర్మించారు. గోడలతో కాకుండా పెద్ద మొత్తంలో స్టీల్ స్ట్రక్చర్స్‌ను వినియోగించి శిల్పారామం కన్వెన్షన్ హాలును నిర్మించారు. సుమారు రూ.10 కోట్లతో నిర్మించిన ఈ హాలులో ఒకేసారి 1000 మంది అతిథులు హాయిగా కూర్చుని కార్యక్రమాలను వీక్షించే, నిర్వహించుకునేందుకు వీలుగా ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. దీంతో వంటశాలను విశాలమైన స్థలంలో ఏర్పాటు చేసి, ఇతర మౌలిక వసతులను కల్పించారు. సోమవారం ఉదయం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శిల్పారామం కన్వెన్షన్ హాలును ప్రారంభించారు. అందరినీ ఆకట్టుకునేలా నిర్మాణంతో పాటు గార్డెనింగ్, ల్యాండ్ స్కేపింగ్‌ను నిర్మించారని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మూసీ లాంటి ప్రాంతంలో ఇలాంటి అందమైన నిర్మాణం రావడం తమకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని పలువురు పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం
ఉప్పల్ స్కైవాక్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌కు భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్(బీఆర్టీయూ) ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య ఆధ్వర్యంలో సోమవారం భారీ ఆటో ర్యాలీ చేపట్టారు. జై తెలంగాణ, జై కేటీఆర్ నినాదాలతో సభ్యులు హోరెత్తించారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.