KTR | ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు అని కేటీఆర్ తెలిపారు. అంబేద్కర్ మనకు ఓటు హక్కు కల్పించారని పేర్కొన్నారు. SIRపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన వాళ్లందరూ ఓటు ఎన్రోల్మెంట్ చేసుకోవాలన్నారు. 2025 ఓటరు లిస్ట్ ప్రకారం మొత్తం 3.39 కోట్ల ఓట్లు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పోలింగ్ బూతులు 35,985 ఉన్నాయని చెప్పారు.
కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యేలు సాయన్న, లాస్య నందిత చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సర్‌పై కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించారు. 1948-51 మధ్య అంబేద్కర్ నాయకత్వంలో రాజ్యాంగంపై కమిటీ వేశారని తెలిపారు. ఏ వర్గమైనా మనిషికి ఒక ఓటు హక్కు ఉండాలని నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. 1951-52లో మొదటిసారి దేశంలో ఎన్నికలు జరిగాయని చెప్పారు.
జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే సర్ గురించి అవగాహన కల్పించుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. సర్ అంటే ఓటరు లిస్ట్‌ను జల్లెడ పట్టే కార్యక్రమమని వివరించారు. 18 ఏళ్లు నిండివారి ఓట్లు చేర్పించాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లిన వారి ఓట్లు మార్పించడం, రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఓట్లు ఉంటే ఒకటే నమోదు చేయించాలన్నారు. బూత్ లెవల్ ఆఫీసర్ 2002 ఓటరు లిస్ట్, ప్రస్తుత ఓటరు లిస్ట్‌ను పోల్చుకుంటారని తెలిపారు.
18 ఏళ్లు నిండిన వారి పేర్లను విధిగా నమోదు చేయించాలని సూచించారు. ఎవరైనా చనిపోతే వారి ఓటును తొలగించాల్సి ఉంటుందని తెలిపారు. ముసాయిదాలో అబ్జెక్షన్లను నమోదు చేసి, ఫైనల్ ఓటరు లిస్ట్‌ను ప్రకటిస్తారని పేర్కొన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ఒకటే ఓటరు లిస్ట్ ఉంటుందని అన్నారు. డిఫెన్స్ ల్యాండ్‌లో ఉన్న 35 వేల మందికి ఓటు కల్పించే బాధ్యత తీసుకోవాలని కంటోన్మెంట్ బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. అధికారులు వినకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వద్దకు వెళ్లి పోరాడుదామని అన్నారు. ఎన్నికలు ఇప్పుడు జరిగినా వాటికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గులాబీ కండువా కప్పుకున్న సైనికులు ఎన్నికల నాటికి హైరానా పడకుండా చూసుకోవాలన్నారు.
ఓటరు లిస్ట్‌ను కరెక్టుగా జల్లెడ పడితే హైరానా పడాల్సిన అవసరం ఉండదని కేటీఆర్ తెలిపారు. జూన్ 25వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు ఇంటింటి వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపారు. వారం తర్వాత డ్రాఫ్ట్ ఓటరు లిస్ట్ ప్రకటిస్తారని చెప్పారు. జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. నెల రోజుల పాటు వచ్చిన అభ్యంతరాలను స్క్రూట్నీ చేసి ఫైనల్ లిస్ట్‌ను ప్రకటిస్తారని చెప్పారు. 2026 అక్టోబర్ 1వ తేదీన ఫైనల్ లిస్ట్‌ను ప్రకటిస్తారని తెలిపారు.
పోలింగ్ బూత్‌కు ఇద్దరి చొప్పున బూత్ లెవల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నామని కేటీఆర్ తెలిపారు. బీఎల్వో వెంట ఇంటింటికీ వెళ్లి ఓట్లను పరిశీలించాలని సూచించారు. సరిగ్గా ఫామ్ నింపుతున్నారా లేదా పరిశీలించాలన్నారు. తప్పుడు ఓట్లను తొలగించాలని.. అర్హుల ఓట్లను నమోదు చేయించాలని సూచించారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు ముందు 95 లక్షల ఓట్లు తొలగించారని తెలిపారు. బెంగాల్లో 25 లక్షల మంది కోర్టులో కొట్లాడుతున్నారని పేర్కొన్నారు. బిహార్‌లో 65లక్షల ఓట్లు తొలగించారని చెప్పారు. గెలుపు, ఓటములకు ఈ ఓట్లే కారణం కావచ్చు.. అందుకే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
మైనార్టీల్లో ఓట్లు పోతాయేమోనన్న భయం ఉందని కేటీఆర్ అన్నారు. అర్హులైన మైనార్టీల ఒక్క ఓటు కూడా పోకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఏపీ, తెలంగాణలో రెండు వేర్వేరు ఓట్లు ఉండొచ్చని అన్నారు. డూప్లికేట్ ఓటర్ల లిస్ట్‌ను మీకు అప్పగిస్తాం.. వాటిని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్‌లో దొంగ ఓట్లు నమోదు చేయించుకోవడం వల్లనే ఓడిపోయామని తెలిపారు. మనిషికి ఒకే ఓటు ఉండేలా అప్రమత్తతగా ఉంటూ ఏజెంట్లు పనిచేయాలని సూచించారు. ప్రతి ఓటు విలువైనదే అని.. బూత్‌లోని ఓటు రక్షించుకోవడం బాధ్యత భావించాలన్నారు. కేసీఆర్ సీఎం కావాలనే బలమైన అంకితభావం ఉంటే.. గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ప్రతి బూత్ పరిధిలో అర్హులైన వారి ఓట్లు కాపాడుకోవాలని సూచించారు. 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం తథ్యమని అన్నారు. నిఖార్సయిన కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకెళ్దామని అన్నారు.