హైడ్రా తీరు మారదా.. కోర్టు మొట్టికాయలేసినా.. న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసినా.. తవ్వకాలను ఆపేది లేదా.. అని సున్నంచెరువు వద్ద సియేట్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హైడ్రా అధికారులు, సిబ్బంది సియేట్కాలనీ సైట్లలో పనులు చేయడాన్ని కాలనీ వాసులు అడ్డుకున్నారు. 26న హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సియేట్ కాలనీ వాసుల ప్లాట్లలో ఎలాంటి తవ్వకాలు, ఫెన్సింగ్
పనులు చేయవద్దని ఆదేశించింది.

సిటీబ్యూరో, నవంబర్ 28(నమస్తే తెలంగాణ) : సున్నం చెరువు వద్ద సర్వే నిర్వహించడంతో పాటు గ్రామ సరిహద్దులు నిర్ధారించే వరకు వాళ్ల జోలికి వెళ్లొద్దని కోర్టు చెప్పినా హైడ్రా మాత్రం పనులు ఆపకుండా తవ్వకాలు జరుపుతూనే ఉంది. ఈ విషయంపై సియేట్ కాలనీ వాసులు పోలీసు స్టేషన్కు వెళ్లినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం సీపీ మహంతిని కలిసేందుకు వెళ్లగా ఆయన మీటింగ్లో ఉన్నారని చెప్పడంతో అక్కడ నుంచి నేరుగా వచ్చి మాదాపూర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తమ స్థలాల్లోకి వచ్చేవరకు అక్కడ హైడ్రా పనులు చేస్తూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పనులు చేయొద్దంటూ సియేట్ కాలనీ వాసులు హైడ్రా సిబ్బందిపై మండిపడగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
హైడ్రా తరపున యూనస్ అనే వ్యక్తి తాము చెరువు ప్రాంతంలో పనులు చేస్తున్నామని తాను పదిరోజుల్లో చెరువు పనులు పూరి ్తచేయాలని హైడ్రా కమిషనర్ కఠిన నిబంధన పెట్టారని చెప్పి పనులు కొనసాగించడంతో సియేట్ వాసులు ఆందోళనకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పనిచేయవద్దంటూ తమ ప్లాట్లలో పనులు చేస్తున్న జేసీబీలకు అడ్డంగా కూర్చున్నారు. విషయం తెలుసుకున్న మాదాపూర్ పోలీసులు సున్నం చెరువు వద్దకు వచ్చి సియేట్ కాలనీ వాసులను వెళ్లిపోవాలని, హైడ్రాను పనులు చేసుకోనివ్వాలని చెప్పారు. పోలీసు అధికారులకు సియేట్ ప్రజలు తమ వద్ద ఉన్న కోర్టు ఆర్డర్లను చూపించారు. సియేట్ కాలనీ వాసులను చుట్టుముట్టి అక్కడనుంచి తరలించే ప్రయత్నం చేయగా తాము కదిలేది లేదని, తమ భూముల నుంచి హైడ్రా సిబ్బంది, పరికరాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో అధికారులు, సియేట్ కాలనీ వాసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
పోలీసు అధికారులకు తమ వద్ద ఉన్న కోర్టు ఉత్తర్వులను చూపించినప్పుడు వారు హైడ్రాకు మద్దతుగానే మాట్లాడడంతో సియేట్ వాసులు ఈ వ్యవహారంపై హైకోర్టు గేటు ఎదుట ధర్నా చేస్తామని, కోర్టు ఉత్తర్వులను కూడా హైడ్రా ఉల్లంఘిస్తుంటే పోలీసులు తమ గోడు వినిపించుకోకుండా హైడ్రాకే ఎలా సపోర్ట్ చేస్తారని ప్రశ్నించారు. తమ స్థలాల్లో పనులు చేయడానికి వారెవరని, తమకు హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పోలీసులు వారికే ఎలా మద్దతు పలుకుతారంటూ ప్రశ్నించారు. అక్కడకు వచ్చిన బాలగోపాల్ అనే హైడ్రా అధికారి సియేట్ కాలనీ వాసులను సముదాయిస్తూ తమకు పైనుంచి ఒత్తిడి ఉందని, తాము పని చేయకపోతే కమిషనర్ తిడుతారంటూ చెప్పుకొచ్చారు.
అయితే సియేట్ కాలనీ వాసుల ఆందోళనపై హైడ్రా అధికారులు మాట్లాడగా చెరువులో పనులు చేయండని అక్కడ నుంచి వెళ్లాలంటూ సూచించినట్లు చెప్పి అక్కడ నుంచి చెరువు వైపు వెళ్లి పనులు చేశారు. హైకోర్టు బుధవారం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ హైడ్రా మాత్రం గురు, శుక్రవారాల్లో కూడా పనులు చేయడం వెనుక హైకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరును హైకోర్టు పలుసార్లు తప్పుబట్టింది. కోర్టు చెప్పినా కూడా హైడ్రా కమిషనర్ ఇలా చేయడమేంటని, ఇదేం ప్రభుత్వమంటూ సున్నంచెరువు వద్ద సియేట్ కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు.
సియేట్ వాసుల ఆందోళనకు బీఆర్ఎస్ మద్దతు పలికి వారికి అండగా నిలిచింది. స్థానిక బీఆర్ఎస్ నాయకుడు కార్తీక్ ఈ వ్యవహారాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఆర్డర్లు, హైడ్రా పనులపై కేటీఆర్కు కార్తీక్ వివరించగా ఆయన ఎప్పటికప్పుడు అక్కడి విషయాలను తనకు అప్డేట్ చేయాలని సూచించారు. సామాన్యుల భూములను రేవంత్ సర్కార్ దౌర్జన్యంగా హైడ్రా పేరుతో కబ్జా చేయాలని చూస్తున్న ఈ వ్యవహారంలో బాధితుల పక్షాన పోరాటం చేయాలని కేటీఆర్ చెప్పినట్లు కార్తీక్ పేర్కొన్నారు.