బేగంపేట్ జూన్ 18: బేగంపేట్ బ్రాహ్మణవాడిలోని శ్రీ రామనంద తీర్థ మెమోరియల్ స్కూల్, విద్యార్థుల సంక్షేమానికి అండగా ఉంటామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సీల్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రామానంద తీర్థ్ధ మొమోరియల్ కమిటీ ప్రాంగణంలో విద్యను అభ్యసిస్తున్న 240 మంది విద్యార్థులకు గురువారం నోట్ బుక్స్, బ్యాగ్స్ పంపిణీ చేసే కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన అనంతరం తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని మిగతా కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు.

అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. 2023లో కేసీఆర్ నాయకత్వంలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని తీసుకువచ్చామని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా సీల్వెల్ సంస్థ అధినేత సుబ్బారావు, తలసాని ట్రస్ట్ నిర్వాహకులు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం తలసాని మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా తమ ట్రస్టు పనిచేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ నిర్వాహకులు, ఎమ్మెల్సీ సురభీ వాణిదేవి, శేఖర్ మారంరాజు, మాజీ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి, శేషుకుమారి, బీఆర్ఎస్ నాయకులు.. సురేష్‌యాదవ్, పవన్‌కుమార్‌గౌడ్, నరేందర్‌రావు, కిషోర్‌కుమార్, శేఖర్‌ముదిరాజ్, శ్రీనివాస్‌గౌడ్, బాల్‌రెడ్డి, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.