‘మేమున్నాం.. అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం.. మీ కష్టాలు పరిష్కరించేందుకు పోరాటాలు చేస్తామం’టూ.. ఆటోడ్రైవర్లకు భరోసా కల్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఆటో డ్రైవర్లకు సంఘీభావం తెలుపుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం ఖాకీ చొక్కాలు ధరించి..ఆటోలో అసెంబ్లీకి వెళ్లారు. ఆటో కార్మికులను ఆదుకోవాలంటూ.. ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ఆటో డ్రైవర్లను ఆదుకోవడంలో సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి.. రూ. 12వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. బీఆర్ఎస్ పక్షాన తాము పోరాడతామని స్పష్టం చేశారు.
సిటీబ్యూరో/ కేపీహెచ్‌బీకాలనీ/కాప్రా/ ఎల్బీనగర్ : ‘ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలి.. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి… ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మిక కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి.’ అని నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం ఆటో డ్రైవర్ల యూనిఫాం ఖాకీ చొక్కాలు ధరించి అసెంబ్లీకి వెళ్లారు. ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి 25 ఆటోల్లో ర్యాలీగా అసెంబ్లీ వరకు వెళ్లారు. కేటీఆర్ స్వయంగా ఆటో నడుపుతూ.. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున కేటీఆర్ వద్దకు చేరుకుని తమ సమస్యలపై పోరాడుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 8 లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలకు చాలా పెద్ద ఎత్తున వరాల మూట ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని అన్నారు. డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని..
ఇన్సూరెన్స్‌లు పెంచుతామని, జీవన భద్రతకు ఢోకా లేకుండా చేస్తామని రకరకాల హామీలిచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డేటా మొత్తం గతంలో జరిగిన శాసనసభ సమావేశంలోనే ప్రభుత్వానికి అందజేశామని గుర్తు చేశారు. ఇంతమంది ఆటో డ్రైవర్లు చనిపోయారు.. ఒక్కొక్క కుటుంబానికి పది లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు ఎంతో ఇచ్చి ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశామన్నారు. కానీ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్టు ఇప్పటి వరకు స్పందించలేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో అన్నలకు సంఘీభావంగా మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తామంతా అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చామని చెప్పారు. ఖాకీ చొక్కాలు ధరించి ఆటోల్లోనే అసెంబ్లీకి వెళ్లామని పేర్కొన్నారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఆటో ర్యాలీలో పాల్గొని ఆటో డ్రైవర్లకు అండగా నిలిచారు.
నేనున్నాను..
ఆటో ర్యాలీలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోలో ఎక్కి కూర్చున్నారు. ఆటో నడిపే డ్రైవర్లను అసెంబ్లీలోకి రానివ్వరు. దీంతో ఎమ్మెల్యేలు స్వయంగా ఆటో నడుపుకొంటూ అసెంబ్లీలోకి వెళ్లాలని భావించారు. అయితే ఎవరికీ ఆటో నడుపొచ్చొననే చర్చలు ప్రారంభమయ్యాయి. ఇంతలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ‘నాకొచ్చు’ అంటూ ఆటో హ్యాండిల్ పట్టుకొని రెడీ అయిపోయారు. ఆ తర్వాత మరో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కూడా తనకూ వచ్చునని ఆటో తీసుకున్నారు. మరో ఆటో అవసరం ఉంది కదా ఎవ్వరున్నారు అని అడుగుతుండగానే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘నేనున్నాను’ అంటూ వచ్చేశారు. స్వయంగా కేటీఆర్ ఆటో స్టార్ట్ చేసి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఎక్కించుకుని అసెంబ్లీకి బయలుదేరారు. రోడ్డు వెంట కేటీఆర్ ఆటో నడుపుకొంటూ వెళ్తుంటే.. అది చూసిన జనం తమ మొబైల్ ఫోన్లో వీడియోలు తీశారు. జై కేటీఆర్..జై కేసీఆర్.. జై తెలంగాణ అంటూ నినాదాలు చేసి.. తమ అభిమానాన్ని చాటుకున్నారు.