సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పాలకమండలి సర్వసభ్య సమావేశం.. ప్రతి 3 నెలలకోసారి జరగాల్సి ఉన్నా..గడిచిన రెండేళ్లుగా 5 నెలలు దాటినా కౌన్సిల్ సమావేశాలను నిర్వహించలేదు. దీనికి తోడు ప్రస్తుత పాలకమండలి గడువు మరో 79 రోజుల్లో ముగియనున్నది.ఈ నేపథ్యంలోనే మంగళవారం జరగనున్న కౌన్సిల్ సమావేశం చివరిది కానుండటంతో ప్రాధాన్యత సంతరించుకున్నది.
సభ్యుల నుంచి ఆయా అంశాలపై వివరణ, సమాధానాలు కోరడంతో పాటు ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ అంశాలపై ప్రశ్నించేందుకు విపక్షాలు అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో మేయర్ ప్రసంగం, ప్రశ్నోత్తరాల పర్వం వంటివి నిర్వహించనున్నారు. హెచ్ సిటీ, ఎస్ఆర్డీపీ పనులు, వీధి లైట్లు, శానిటేషన్, వీధి కుక్కల బెడద, రహదారుల నిర్వహణ లోపాలపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గళం విప్పనున్నాయి.
ప్రధానంగా రెండేళ్ల కాలంలో హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడడం, ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేయడం, కొత్తగా ఒక్క ప్రాజెక్టు చేపట్టలేకపోవడం తదితర ప్రజా సమస్యలపై నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రశ్నలను సమర్పించి సభను ఇరుకునపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్పొరేటర్లతో గురువారం తెలంగాణ భవన్లో సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో కౌన్సిల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్పొరేటర్లకు దిశానిర్ధేశం చేయనున్నారు.
ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే జీహెచ్ఎంసీ సెక్రటరీ సెక్షన్.. కార్పొరేటర్ల నుంచి సుమారు 100 ప్రశ్నలను స్వీకరించారు. హెచ్ సిటీ పనులు, ఎస్ఆర్ డీపీ పనులు, దశాబ్దాలుగా వివాదంగా ముడిపడి ఉన్న ప్రధాన కార్యాలయంలో పరిషారమైన విగ్రహాల పంచాయతీతో పాటు స్ట్రీట్ లైట్ల నిర్వహణలో లోపాలపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిలదీయనున్నారు. ఇక మజ్ల్లిస్, బీజేపీ పార్టీలు మాత్రం ఎప్పటిలాగే ప్రజా సమస్యలైన శానిటేషన్, దోమలు, కుకల బెడద, స్ట్రీట్ లైట్ మెయింటనెన్స్, రోడ్ల నిర్వహణ, నాలాలు, వరద నీటి కాలువల నిర్వహణ వంటి అంశాలను ప్రస్తావించనున్నాయి.
రానున్న ఆర్థిక సంవత్సరం (2026-27) కు సంబంధించిన జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ పై ప్రస్తుతం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ సారి బడ్జెట్ రూ.10 వేల కోట్లు దాటే అవకాశమున్నందున, బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి అన్ని పార్టీల సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. మున్సిపల్ యాక్టు 1959 ప్రకారం నవంబర్ 10 లోపు స్టాండింగ్ కమిటీ, డిసెంబర్ 10లోపు బడ్జెట్ ను ఆమోదించి తదుపరి ఆమోదం కోసం సరార్కు పంపాల్సి ఉన్నందున ఈనెల 25న జరగనున్న కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్ పై లఘు చర్చకు అవకాశం లేకపోలేదు. ఈ సమావేశంలో లఘు చర్చకు అనుమతి ఇచ్చి, సభ్యుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత జనవరిలో నిర్వహించాలని భావిస్తున్న కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్ కూడా వ్యూహాత్మకంగా ఆమోద ముద్ర వేయాలని పాలక మండలి భావిస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి సమావేశాలు హాట్‌హాట్‌గా జరగడం మాత్రం ఖాయం.