చిన్నారి భవిత సర్జరీకి ఆర్థిక సాయం చేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పెద్దమంగళారానికి చెందిన యాదిరెడ్డి తెలంగాణ కోసం ఢిల్లీలోని పార్లమెంట్ ఎదుట ఆత్మబలిదానం చేసుకున్నాడు. కాగా ఆయన సోదరుడు ఓంరెడ్డి కుమార్తె భవిత టాన్సిల్స్ సమస్యతో బాధపడగా స్పందించిన కేటీఆర్ పాప సర్జరీకి రూ. లక్ష అందజేశారు.
– మొయినాబాద్, జూన్ 30
మొయినాబాద్, జూన్ 30 : చిన్నారి భవిత సర్జరీకి ఆర్థిక సాయం చేసి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. చిన్నారి గొంతు భాగంలో ఏర్పడిన టాన్సిల్స్‌తో గత కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బంది పడుతున్నది. ఆర్థిక స్థోమత సరిపోక ఆమె తల్లిదండ్రులు శస్త్రచికిత్స చేయించలేకపోయా రు. ఈ విషయం కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో స్పందించిన ఆయన రూ. లక్ష ఆర్థిక సాయం అందించి ఆ చిన్నారిని ఆదుకున్నారు.
మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధి, పెద్దమంగళారం గ్రామానికి చెందిన యాదిరెడ్డి తెలంగాణ రాష్ట్రం కోసం ఢిల్లీలోని పార్లమెంట్ ఎదుట ఆత్మబలిదానం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, గత కేసీఆర్ ప్రభుత్వం యాదిరెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకున్నది. ఆ కుటుంబ యోగక్షేమాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదేశించడంతో ఆయన గతనెల 28న మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌లతో కలిసి ఆ కు టుంబాన్ని సందర్శించారు.
వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్న క్రమంలో యాదిరెడ్డి సోదరుడు ఓంరెడ్డి కుమార్తె భవిత టాన్సిల్స్ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నదని.. చిన్నారికి సర్జ రీ చేయించాలని డాక్టర్ చెప్పారని కేటీఆర్‌కు యాదిరెడ్డి తల్లి చంద్రమ్మ, సోదరుడు ఓంరెడ్డి చెప్పారు. స్పందించిన కేటీఆర్.. ఏ దవాఖానలో సర్జరీ చేయించాలనుకుంటున్నారో త్వరగా చేయించాలని.. అందుకు అవసరమైన ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చారు.
కేటీఆర్ హామీ ఇచ్చిన రెండు రోజుల్లోనే పాప సర్జరీకి రూ. లక్ష ఆర్థిక సాయా న్ని అందించారు. మంగళవారం నగరంలో ఓ ప్రైవేట్ దవాఖానలో పాపకు శస్త్రచికిత్స చేయడంతో ఆమె ఆరోగ్యం మెరుగవుతున్నదని.. ఆర్థిక సాయం చేసిన కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలని ఓంరెడ్డి పేర్కొన్నారు. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటామన్నారు.