సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్లకు నష్టం చేకూర్చి.. కాంట్రాక్టులన్నీ తన అనుయాయులకే సీఎం రేవంత్ ఇచ్చుకుంటున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నచిన్న కాంట్రాక్టర్స్ను బలి తీసుకునే జీవో 17ను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో పదివేల మంది నిరుపేదలను కాంట్రాక్టర్స్‌గా ప్రోత్సహించి ఉన్నతస్థాయికి తీసుకొచ్చామని ఆయన తెలిపారు. రేవంత్ సర్కార్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి చెందిన కాంట్రాక్టర్స్‌కు పైసా పని కూడా కేటాయించలేదని విమర్శించారు.
దమ్ముంటే చిన్న కాంట్రాక్టర్లకు విడుదల చేసిన నిధులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కచ్చితంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాంట్రాక్టర్స్‌కు అండగా ఉంటామని భరోసానిచ్చారు. 50వేల మందిని కాంట్రాక్టర్స్‌గా తీర్చిదిద్దుతామని అభయమిచ్చారు. ఇందిరాపార్క్‌లో తెలంగాణ ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీవో 17ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం మహాధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేమెంట్ కోటాలో గద్దెనెకారని, ఆయన ఒక రెగ్యులర్ సీఎం కాదని, కేవలం రెన్యువల్ సీఎం అని కేటీఆర్ చురకలు అంటించారు. ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్‌కు నెలనెలా కప్పం కట్టకపోతే సీఎం పదవి ఊస్ట్ అవుతుందని ఎద్దేవా చేశారు. ఇవాళ రాష్ట్రంలో కాంట్రాక్టులు కేవలం రేవంత్ రెడ్డి బావమరిది, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, విశ్వేశ్వర్ రెడ్డిలకే దక్కుతున్నాయన్నారు. రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి సంబంధించిన రూ.4 వేల కోట్ల కాంట్రాక్టును తన అనుయాయులకే ఇచ్చుకున్నారని విమర్శించారు. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రూ.1300 కోట్ల కాంట్రాక్టులు కేటాయిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యంగ్ ఇండియా స్కూల్ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటివరకు రూ.4 లక్షల కోట్ల అప్పు చేశారని, అందులో రూ.4 అయినా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాంట్రాక్టర్లకు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎవరైనా రేవంత్‌ను ఇచ్చిన హామీలపై ప్రశ్నలు అడిగితే బైరాగి, బఫూన్ మాటలు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ అద్భుత విజన్‌తో పదివేల మంది నిరుపేదలను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దామని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎదగొద్దనే జీవో 17తో అణిచివేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రోజుకు 18 గంటలు రివ్యూ చేస్తున్నట్టు చెప్పుకొంటున్నాడని.. ఆ రివ్యూలన్నీ భూములు ఎలా కబ్జా పెట్టాలి? ఎలా దోచుకోవాలి అనే జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు.
సీఎం రేవంత్‌కు సర్వేనంబర్లకు, జీవో నంబర్లకు తేడా తెలియడం లేదన్నారు. బాలికను వేధించిన వ్యక్తిని వారం రోజులు కాపాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. కేటీఆర్ జడ్జి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ లెక్కన తీర్పులిస్తున్నారని సీఎం అంటున్నారని, ‘ఒకవేళ కేటీఆర్ జడ్జి, నేను పోలీస్‌నైతే నువ్వు ఇప్పటికే చర్లపల్లి జైలులో ఉండేవాడి’వని చురకలు అంటించారు. అనంతరం మాజీ మంత్రి సత్యావతి రాథోడ్ మాట్లాడుతూ.. జీవో 17తో పేద, మధ్య తరగతి కాంట్రాక్టర్లను కాదని బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టిన రేవంత్‌కు బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్ శ్యాం, రాకేశ్ రెడ్డి పాల్గొన్నారు.