సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : యాభై ఏండ్ల నుంచి ఉంటున్న ఇండ్లను కూల్చేందుకు వస్తున్న రేవంత్ రెడ్డి… పేదల పాలిట గద్దలెక్క మారిండని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రిజిస్ట్రేషన్ ఫీజులు, గరీ పట్టీలు కట్టుకుంటూ, కూలీనాలీ చేసుకుంటూ బతుకీడుస్తున్న ఎంతో మంది పేదల జీవితాలను మూసీలో కలిపేందుకు ఇందిరమ్మ రాజ్యం సిద్ధమైందన్నారు.
ఇప్పటికే ఇంటింటికీ ఎర్ర రంగు పూసిన కాంగ్రెస్… వాటిని కూల్చడమే తరువాయి అన్నట్లుగా నక్కలా ఎదురు చూస్తున్నదని ఎద్దేవా చేశారు. బస్తీల్లోకి వచ్చే బుల్డోజర్లను అడ్డుకుని పేదల ఇండ్లకు అడ్డుగా బీఆర్ఎస్ నిలుస్తుందని అంబర్‌పేట నియోజకవర్గం పరిధిలోని న్యూ అంబేద్కర్ నగర్, న్యూ తులసీరాంనగర్ కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఇండ్లపైకి వచ్చే అధికారులను చెప్పులు, చీపుర్లతో అడ్డుకోవాలని, బుల్డోజర్లను అడ్డుకొని ఇండ్లను కాపాడుకోవాలన్నారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి… సీఎం కాగానే హైదరాబాద్ వాసులపై పగబట్టినట్లు వ్యవహరిస్తున్నాడని అసహనం వ్యక్తం చేశారు. మూసీ డెవలప్మెంట్ పేరిట లక్షన్నర కోట్ల ఖజానాకు గండికొట్టి… పేదల ఇండ్లను మూసీలో కలిపే కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. పండుగ పూట హైదరాబాద్ వాసులను హైడ్రా పేరిట భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మూసీమే లూటో… ఢిల్లీమే బాటో పేరిట లక్షన్నర కోట్లతో బ్యూటిఫికేషన్ చేస్తామంటున్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు కట్టిస్తానని చెప్పి.. మల్లయ్య ఇంటిని కూలగొట్టి మాల్ కడితే ఏం వస్తుందన్నారు. ఇక్కడున్నవన్నింటినీ బొందల గడ్డలు చేసి, రిసార్టులు, మల్టీఫ్లెక్సులను కడితే ఒరిగేదేమిటనీ ప్రశ్నించారు. ఇక దేవుని పేరిట ఓట్లు అడిగి, పదవులు అనుభవిస్తున్నా కిషన్ రెడ్డి… ఇబ్బందుల్లో ఉన్న పేదల పక్షాన ఎందుకు నిలవడం లేదన్నారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలిసి పేదలను పీక్కుతినేలా ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు.
మొగోనివైతే ఆరు గ్యారంటీలు అమలు చెయ్!
ఇళ్లు ఖాళీ చేయించి భయభ్రాంతులకు గురి చేసేలా సైదాబాద్ శంకర్‌నగర్‌లో బుల్డోజర్లు తీసుకెళ్తున్న రేవంత్ రెడ్డి.. మొగోనివైతే ఆరు గ్యారంటీలు నెరవేర్చి, బీఆర్ఎస్ కట్టిన లక్ష ఇండ్లకు ధీటుగా రెండు లక్షల డబుల్ ఇండ్లు కట్టాలని సవాల్ విసిరారు. పేదలను రోడ్డున పడేస్తానంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడూ రూ. 16వేల కోట్లతో మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు రూపొందించామని గుర్తు చేశారు.
కానీ ప్రాజెక్టు కారణంగా ఎంతో మంది పేదలు నిరాశ్రయులు అవుతారనే కారణంతో అప్పటి సీఎం కేసీఆర్ ప్రాజెక్టును పక్కన పెట్టేయమని సూచించారు. మూసీలో కలుస్తున్న వ్యర్థాలను నిలువరించేలా వంద శాతం డ్రైనేజీ శుద్ధికి రూ. 4500 కోట్లతో ఎస్టీపీలను నిర్మించామన్నారు. దీంతోనైనా కాలుష్య తీవ్రత తగ్గించామన్నారు. మూసీ ప్రక్షాళన పేరిట కాంగ్రెస్ చేస్తున్న లూఠీని అడ్డుకునేందుకు న్యాయపోరాటం చేస్తామని, పేదల పక్షాన నిలిచి ఇండ్లను కాపాడుతామన్నారు.
గరీబోళ్లపై జులుం వద్దు..
గరీబోళ్లపై జులుం చేస్తే పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు చెప్పారని, ప్రభుత్వ పెద్దలు ఆదేశించారనే మాటలతో పేదలను అడ్డుకునే క్రమంలో కేసులు, వేధింపులకు పాల్పడితే.. మిత్తితో కలిపి చెల్లిస్తామన్నారు. అనంతరం అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లపై మార్కింగ్ చేసి మూసీ పేరిట ఇండ్లను కూల్చివేసేందుకు సిద్ధమైందన్నారు. ప్రజలను భయాందోళనలకు గురిచేన్నదని… గడిచిన 15రోజులుగా నిద్రాహారాలు మారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారని తెలిపారు.
అంబర్‌పేట నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ అన్ని అనుమతులు, కరెంట్ చార్జీలు కడుతున్నారని తెలిపారు. ఇటీవల జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలిని కలిసినప్పుడు కూడా అంబర్‌పేటలో మూసీ పరీవాహక ప్రాంతంలో ఎలాంటి కబ్జాలు లేవని గుర్తు చేసినట్లు కాలేరు వెల్లడించారు. మూసీ డెవలప్మెంట్ పేరిట ఏం చేస్తావో ముందుగా సీఎం రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, బాల్క సుమన్, కార్తీక్ రెడ్డితోపాటు బీఆర్ఎస్ నేతలు, నాయకులు హాజరయ్యారు.
ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా..!
ఇందిరమ్మ రాజ్యం తెస్తానని ఓట్లేపించుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇండ్లు కూల్చుతున్నడు. కాయ కష్టం చేసి రూపాయి రూపాయి పోగేసి 60 గజాల్లో ఇల్లు కట్టుకుని గత ముప్ఫై ఏండ్లుగా ఇక్కడనే ఉంటున్నాం. ఇప్పడు ఉన్నట్టుండి ఇండ్లు కూలుస్తామని అంటున్నరు.. మేమెక్కడికి పోవాలె..ఎట్ల బతకాలే…ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా..!
– సుమతి, తులసీరాంనగర్, గోల్నాక
చావనైనా చస్తాం..ఇక్కడి నుంచి కదలం
ఎన్నో ప్రభుత్వాలను చూశాం.. ఎందరో ముఖ్యమంత్రులను చూశాం.. కానీ ఇసొంటి ముఖ్యమంత్రిని మాత్రం ఇప్పటి వరకు చూడలె.. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి తొమ్మిది నెలలైనా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు.. ఇప్పుడొచ్చి మూసీని లండన్ చేస్తా నంటూ పేదోళ్ల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు..మా ఇండ్ల జోలికొస్తే చావనైనా చస్తాం కానీ..ఇక్కడి నుంచి కదలం.
– కమీర్, తులసీరాంనగర్, గోల్నాక,
రేవంత్‌కు మా ఉసురు తగులుతది
నెల రోజులుగా తిండి తిప్పలు లేకుండా నిద్రలేని రాత్రులు గడపుతున్నాం.. ముప్ఫై ఏండ్ల కింద ఇక్కడ 60 గజాల జాగా కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం.. నల్ల్లా బిల్లు, కరెంటు బిల్లు, ఇంటి ట్యాక్సీ కూడా కడుతున్నాం..పట్టా కాగితాలు కూడా ఉన్నయి. ఇప్పుడు మా ఇల్లు కూల్చుతామనడం ప్రభుత్వానికి ఎంత వరకు న్యాయం.. సీఎం రేవంత్ రెడ్డికి మా ఉసురు తగులుతది.
– ఉమాదేవి,తులసీరాంనగర్, గోల్నాక
పేదలపై రేవంత్ రెడ్డి కక్ష కట్టిండు
మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వెయ్యలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష కట్టిండు.. ఇప్పుడు మా ఇండ్లు కూల్చేస్తామని భయ పెడుతుండు.. నాకు ఇద్దరు చిన్న పిల్లలు..కూలీ నాలీ పనిచేస్తూ బతుకెళ్లదీస్తున్నం..పిల్లలు మన ఇల్లు కూల్చుతారా మమ్మీ.. ఎక్కడ ఉంటాం…మేమెక్కడ చదువు కోవాలె అంటూ తిండి తినకుండా బెంగ పెట్టుకొని జ్వరాల పాలైనరు..
– లక్ష్మి, తులసీరాంనగర్, గోల్నాక
ప్రాణమైనా తీసుకుంటం.. కదలం
మేం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇండ్లు కట్టుకోలే.. పైసా పైసా పోగేసిన సొమ్ముతో ఇంటి స్థలం కొనుకున్నాం. ఇండ్లకు నంబర్లు ఇచ్చిన్రు..డ్రైనేజీలు, రోడ్లు వేసిండ్రు..టాక్సీలు కడుతున్నం.. ఇప్పుడొచ్చి మీ ఇంటిని కూల్చుతాం..దూరం లో డబుల్ బెడ్రూం ఇస్తాం అంటే ఎలా పోతాం.. ప్రాణమైనా తీసుకుంటం కానీ ఇక్కడి నుంచి కదలం
-మల్లేశ్‌గౌడ్, తులసీరాంనగర్, గోల్నాక
గరీబోళ్ల జోలికొస్తే నాశనమైతరు
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్‌కు పోయే కాలం దగ్గరికొచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గరీబోళ్ల జోలికొస్తే సర్వనాశనం అయితరు..తాము కష్ట పడి కట్టుకున్న ఇంటికి బదులుగా అడువుల్లో డబుల్ బెడ్రూం ఇస్తామనడం సరైనా పద్ధతి కాదు.. మా ఇండ్లు కూలగొడతామంటే మాత్రం ఊరుకొం.. మళ్లీ కాంగ్రెసోళ్లు ఓట్లడగడానికి వస్తే సరైన సమాధానం చెబుతాం..
– శంకరమ్మ, తులసీరాంనగర్, గోల్నాక