మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతున్నదని, రూ. 1.5 లక్షల కోట్ల ప్రాజెక్టు కేవలం పెద్ద కుంభకోణమని, కేవలం రూ. 16 వేల కోట్లతో పూర్తయ్యే పనులకు భారీ మొత్తాన్ని ఎందుకు తగలేస్తున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. ఆదివారం అంబర్‌పేట నియోజకవర్గంలో జరిగిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి అసలైన పనులన్నీ గత కేసీఆర్ ప్రభుత్వంలోనే జరిగాయని స్పష్టం చేశారు. ‘మూసీలోకి వచ్చే ప్రతి మురికి నీటి చుకను శుద్ధి చేసేందుకు రూ. 4,000 కోట్లతో ఎస్టీపీలను నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వమే. అంతేకాకుండా మూసీ నదిపై రూ. 545 కోట్లతో 15 కొత్త వంతెలను మంజూరు చేసి, శంకుస్థాపనలు చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేన’ని కేటీఆర్ గుర్తు చేశారు. ఉప్పల్ భగాయత్ నుంచి నాగోల్ వరకు 5 కిలోమీటర్ల మేర ఒక ఇల్లు కూడా కూల్చకుండా, ఒక పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టకుండా కేవలం రూ. 7 కోట్లతో సుందరీకరణ పనులు, వాక్ వేలను నిర్మించి చూపించామన్నారు. అదే తరహాలో మూసీ నదికి ఇరువైపులా రోడ్లు వేసి, ఆక్రమణలు ఉంటే వారికి కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించి పునరావాసం కల్పిస్తే సరిపోతుందని సూచించారు. రూ. 16 వేల కోట్లు అయ్యే చోట.. రేవంత్‌రెడ్డి రూ. 1.5 లక్షల కోట్లు అంటూ ప్రజల సొమ్మును వృథా చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. మూసీ పేరుతో 3 నుంచి 4 వేల ఇండ్లను కూల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే బీఆర్ఎస్ ఊరుకోదని, పేదల పక్షాన పోరాడుతుందని ఈ సందర్భంగా కేటీఆర్ హెచ్చరించారు.
-సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ)

‘గరీబోళ్లు తెలిసీ తెలియక ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే.. నాటి సీఎం కేసీఆర్ ఒక తండ్రిలా ఆలోచించి.. మానవతా దృక్పథంతో జీవో నంబర్ 58, 59 కింద దాదాపు 2.5 లక్షల మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చి అండగా నిలిచారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ఇల్లూ కట్టలేదు.. హైడ్రా, మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల ఇండ్ల నేలమట్టం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను కొండపోచమ్మ సాగర్‌కు తెచ్చి, అకడి నుంచి గ్రావిటీ ద్వారా గండిపేటకు తరలించే చారిత్రాత్మక మార్గాన్ని బీఆర్ఎస్ సర్కార్ సుగమం చేసింది. సముద్ర మట్టానికి గండిపేట 535 మీటర్ల ఎత్తులో ఉంటే, కొండపోచమ్మ సాగర్ 620 మీటర్ల ఎత్తులో ఉంది..అంటే హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్లు గోదావరి జలాలను తెచ్చిపెట్టాం. ఈ నీటిని గండిపేట ద్వారా మూసీ నదిలోకి మళ్లించి నదిని సజీవంగా మార్చేందుకు రూ. 1,100 కోట్లను
కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసింది’.
-కేటీఆర్
రాబోయే ఎన్నికల్లో మనమే గెలుస్తాం
రాబోయే, జీహెచ్ఎంసీ, శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలన వచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నాయని, మరో వారం పది రోజుల్లో ఆ ప్రభుత్వ సగం కాలం ముగిసిపోతుందని గుర్తు చేశారు. ఈ కాలంలో హైదరాబాద్ మహానగరానికి కానీ, ఇకడి ప్రజలకు కానీ జరిగిన మంచి ఏమీ లేదని ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతలు తప్ప.. ప్రజలకు కొత్తగా చేసిందేమీ లేదన్నారు. హైదరాబాద్ మహానగరంలో కనీసం ఒక ఇలె్లైనా కట్టని ఈ ప్రభుత్వం, పేదల పొట్టకొడుతూ వేలాది ఇండ్లను కూల్చివేస్తోందని మండిపడ్డారు. శనివారం, ఆదివారం వస్తే చాలు.. ఏ ఇంటిపైకి ఏ బుల్డోజర్ వస్తుందో తెలియక గరీబోళ్లు బికుబికుమంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రజల సమస్యలపై బీఆర్ఎస్ పోరాడుతుంది.. గల్లీల్లో, బస్తీల్లో వచ్చే ఏ ప్రజా సమస్యలపైనైనా మీరే ముందుండి పోరాడాలి’ అని కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కేవలం ఎమ్మెల్యేల కార్యక్రమాల కోసమే ఎదురుచూడకుండా.. మంచినీరు, కరెంట్, దోమల సమస్య, మురుగునీటి (సివరేజీ) లైన్ల మరమ్మతుల వంటి స్థానిక సమస్యల పరిషారంలో చొరవ చూపాలని పిలుపు నిచ్చారు.

సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ): అంబర్‌పేట నియోజకవర్గంలో ఆదివారం జరిగిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మాట్లాడుతూ.. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి అసలైన పనులన్నీ గత కేసీఆర్ ప్రభుత్వంలోనే జరిగాయని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు చూసినా జేబులో కత్తెర వేసుకుని తిరుగుతున్నారని.. కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లు, భవనాలను ఆయనే స్వయంగా ప్రారంభించి రిబ్బన్లు కట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘ఆయన చీఫ్ మినిస్టర్ కాదు.. కేవలం రిబ్బన్లు కట్ చేసే కటింగ్ మాస్టర్. కేసీఆర్ చేసిన పనులకే రంగులు మార్చి ప్రచారం చేసుకుంటున్నారు’ అని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం జపించే ఫ్యూచర్ సిటీపై కేటీఆర్ ఈ సందర్భంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఉన్న నగరంలో కనీసం దోమల మందు కొట్టేటోడు లేడు.. చెత్త ఎత్తేటోడు లేడు.. మోరీలు సాఫ్ చేసేటోడు లేడు.. కరెంట్ ఇచ్చే తెలివి లేదు.. కానీ ఈయన మాత్రం న్యూయార్, లండన్లతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ కడతారట’ అని కేటీఆర్ అని ఎద్దేవా చేశారు.
క్షేత్రస్థాయిలో కష్టపడే వారికే టికెట్లు
వచ్చే జూలై, ఆగస్టు నెలలో డివిజన్ కమిటీల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని కేటీఆర్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కార్పొరేటర్ టికెట్ల కేటాయింపుపై కేటీఆర్ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. ఎమ్మెల్యేల చుట్టూ, పెద్ద నాయకుల చుట్టూ తిరిగితే టికెట్లు రావని.. ఎవరైతే ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తారో వారికే గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీ కోసం, ప్రజల కోసం నిలబడే నాయకులకే సర్వేల ఆధారంగానే భవిష్యత్‌లో టికెట్లు కేటాయిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్/సర్) పై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అత్యంత చురుగ్గా వ్యవహరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉపాధి, చదువుల కోసం ప్రజలు నిరంతరం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్తుంటారని, కిరాయి ఇండ్లలో మారే క్రమంలో ఓట్ల మార్పిడి జరుగుతుందని గుర్తు చేశారు. ఈ క్రమంలో ప్రతి ఒక కార్యకర్త బాధ్యతగా తీసుకుని ఓటర్ల జాబితా సవరణలో కీలకమైన నాలుగు అంశాలపై దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు.

అంబర్‌పేట బీఆర్ఎస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. ఆదివారం మహారాణా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ ప్రధాన రహదార్లో ఏర్పాటు చేసిన స్వాగత బ్యానర్లతో అంబర్‌పేట గులాబీమయంగా మారింది. సమావేశంలో కేటీఆర్, ఎమ్మెల్యేలు తమ ప్రసంగాలతో కార్యకర్తల్లో నూతన జోష్ నింపారు. ‘జై తెలంగాణ, జై జై కేసీఆర్’ అనే నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. 3 వేలకు పైగా పార్టీ శ్రేణలు పాల్గొన్న కార్యక్రమంలో కేటీఆర్ తదుపరి బీఆర్ఎస్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, తలసాని సాయి కిరణ్‌యాదవ్, ఎడ్ల సుధాకర్ రెడ్డి, దూసరి శ్రీనివాస్ గౌడ్, బీ వెంకట్‌రెడ్డి, కిశోర్ గౌడ్, బద్దల శిరీషయాదవ్, మాజీ కార్పొరేటర్లు దూసరి లావణ్యగౌడ్, విజయ్‌కుమార్‌గౌడ్, బీ పద్మావెంకట్ రెడ్డి, పద్మావతి డీపీ రెడ్డి, సిద్థార్థ్ ముదిరాజ్, మల్లికార్జున్ యాదవ్, చంద్రమోహన్, మేడి ప్రసాద్, భూపతి లక్ష్మణ్, భీష్మ తదితరులు పాల్గొన్నారు.
– గోల్నాక, మే 24
కార్యకర్తలకు కేటీఆర్ సూచించిన నాలుగు ముఖ్య సూత్రాలు
కష్టపడేవారికి గుర్తింపునిస్తాం
పార్టీ కోసం కష్టపడే ప్రతి నాయకుడు, కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు ఇస్తాం. అధిష్టానం ఏ పిలుపునిచ్చినా డివిజన్లవారీగా పోటీపడి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అంబర్‌పేట బీఆర్శ్రేణులకే దక్కింది. ఇదే స్పూర్తితో రాబోయే రాజకీయ పోరాటాలకు సిద్ధంగా ఉండాలి. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. బీఆర్ఎస్ హయంలో నియోజకవర్గం రూపురేఖల మార్చాం. గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరేలా కార్యకర్తలు పనిచేయాలి.
– కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్యే, అంబర్‌పేట
కార్యకర్తల ఐక్యతే బీఆర్ఎస్కు బలం
పార్టీ శ్రేణుల ఐక్య తే బీఆర్ఎస్కు బలం. నలభై ఏండ్లలో అంబర్‌పేటలో జరగని అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలో, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ హయంలో జరిగింది. గత రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ర్టానికి చేసిందేమీ లేదు. వేలాది ఇండ్లను బుల్డోజర్లతో కూలగొట్టడం తప్ప ఒక్క ఇంటినైనా కట్టారా? గ్రేటర్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలి. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇస్తాం.
– తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి
దేశపతి పాటలతో నూతనోత్సాహం
బూత్ లెవల్ కార్యకర్తల సమావేశంలో ప్రముఖ ప్రజాకవి దేశపతి శ్రీనివాస్ పాడిన పాటలతో మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్ సభా ప్రాంగంణం దద్దిరిల్లింది. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆహ్వానం మేరకు హాజరైన ఆయన తన గళంతో తెలంగాణ ఆత్మను మళ్లీ గుర్తుచేశారు. ఉద్యమ స్పూర్తిని నింపే పాటలు గులాబీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రగిలించే పదాలతో ఉత్తేజ పరిచారు. పాటల మధ్యలో ఆయన చెప్పిన మాటలు కూడా పార్టీ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయి. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ స్పూర్తిని మళ్లీ ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ఆయన పాడిన పాటలకు యువ కార్యకర్తలు స్టెప్పులు వేస్తూ గులాబీ జెండాలని ఎగురవేసి సందడి చేశారు.
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బీఆర్ఎస్
కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త గర్వపడాలి. బీఆర్ఎస్ అంటే కేవలం పార్టీ కాదని తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. ఉద్యమ నేత కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే తెలంగాణను తొలి స్థానంలో నిలబెటాం. ఇది కేవలం కార్యకర్తల సమావేశం కాదు.. వచ్చే రాజకీయ పోరాటానికి శంఖారావం. పదవులు శాశ్వతం కాదు.. కేసీఆర్‌లాగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించే నాయకత్వం ఎప్పటికీ నిలిచిపోతుంది. కాంగ్రెస్ పాలనను ప్రజలు తరిమికొట్టే సమయం దగ్గరపడింది. గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సైనికులు మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి.
– శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు కాలం చెల్లింది. ఇక వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. గాలిమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు గుర్రుగా ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంబర్‌పేట నియోజవర్గంలోని అన్ని డివిజన్లను కైవసం చేసుకొని కేసీఆర్ సార్‌కు కానుకగా ఇద్దాం.. గ్రేటర్ ఎన్నికలకు గులాబీ దండు సిద్ధం కావాలి.
-ముఠా గోపాల్, ఎమ్మెల్యే, ముషీరాబాద్