సిటీబ్యూరో/కేపీహెచ్‌బీ కాలనీ, జనవరి 24 : కేపీహెచ్‌బీ కాలనీలో హౌసింగ్ బోర్డు స్థలాలు విక్రయించేందుకు నిర్వహించిన వేలం పాట రసాభాసగా సాగింది. శుక్రవారం కేపీహెచ్‌బీ కాలనీ హౌసింగ్ బోర్డు కమ్యూనిటీ హాల్లో హౌసింగ్ బోర్డు వెస్ట్రన్ డివిజన్ పరిధిలోని ప్లాట్లను విక్రయించేందుకు నిర్వహించిన వేలంపాటను హౌసింగ్‌బోర్డు సెక్రటరీ రాజేశ్, ఈవో విమల, పీఆర్వో వాసు, ఈఈ కిరణ్‌బాబు, ఏఈవో సాయివర్థన్ ప్రారంభించారు. నిబంధనల ప్రకారం…లక్ష రూపాయల డీడీతో రావాలని సూచించగా, స్థలాలను కొనేందుకు ఆసక్తి గలవారు 56 మంది వేలం పాటలో పాల్గొన్నారు.
ఉదయాన్నే ప్రారంభించిన వేలంపాటను కోర్టు ఆదేశాల మేరకు మధ్యాహ్నం వరకు నిలిపివేసి…మళ్లీ కోర్టు ఆదేశాలను పాటిస్తూ వేలం పాటను పూర్తి చేశారు. వేలంలో మొత్తం 24 ప్లాట్లకు 12 ప్లాట్లు అమ్ముడుపోయినట్లు గృహనిర్మాణ శాఖ కమిషనర్ వీపీ గౌతం తెలిపారు. వేలంలో 1696.62 గజాలు అమ్ముడుపోయాయన్నారు. దీంతో ప్రభుత్వానికి రూ.25.63 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో మరో 11 ప్లాట్లకు ఎవరూ బిడ్లు దాఖలు చేయలేదన్నారు. ఒక ప్లాటుపై కోర్టు కేసు ఉందన్నారు. గజానికి రూ.లక్ష కనిష్ఠంగా రూ.లక్షా 5వేలు బిడ్లు దాఖలయ్యాయన్నారు.
కేపీహెచ్‌బీ కాలనీ మొదటి రోడ్డులోని హౌసింగ్ బోర్డు కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన హౌసింగ్ బోర్డు స్థలాల వేలంపాట రసాభాసగా సాగింది. భారీ బందోబస్తు మధ్య సాగిన ఈ వేలం పాటలో ప్లాట్లను కొనుగోలు చేసేందుకు వచ్చిన పలువురు అధికారుల తీరుపై విమర్శలు చేశారు. ఆయా ప్రాంతాల్లో అమ్మకానికి పెట్టిన ప్లాట్లు రోడ్డు విస్తరణలో పోతాయని, వాటికి కొనుగోలు చేస్తే తర్వాత తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకుండా ప్లాట్లను విక్రయిస్తున్నారా అని…. కొనుగోలు చేసే వారికి పలు అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసిన తర్వాతే వేలం పాటను నిర్వహించాలని కోరారు. అయితే అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదు.
పోలీసులు కల్పించుకొని ప్రశ్నలు అడిగిన వారికి వేలంపాట నుంచి బయటికి పంపించడంపై పలువురు విమర్శించారు. ఈ వేలంపాట నిర్వహించేందుకు బందోబస్తుగా బాలానగర్ డీసీపీ, అడిషనల్ డీసీపీ, ఏసీపీ, పలువురు సీఐ, ఎస్సైలుతో పాటు పలు పోలీస్ బృందాలు పాల్గొన్నారు. ఎక్కడికక్కడా బారికేడ్లను పెట్టి… ప్రశాంతంగా వేలంపాట నిర్వహించేందుకు కృషి చేశారు. కాగా, పోలీసులు అతీగా చేయడంతో సామన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వేలం పాట ప్రాంతానికి మీడియాను కూడా అనుమతించకపోవడంపై జర్నలిస్టులు నిరసన తెలిపారు.
Brs Leaders Arrested
సామాన్య ప్రజలకు సొంతింటి కలను నిజం చేయడం కోసం ఏర్పాటు చేసిన హౌసింగ్ బోర్డు సంస్థ.. పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థగా మారిందని, ప్రజలను మోసం చేస్తూ, ధనార్జనే ధ్యేయంగా హౌసింగ్ బోర్డు సంస్థ భూములను అమ్ముతున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కేపీహెచ్‌బీ కాలనీలో నిర్వహించిన హౌసింగ్ బోర్డు స్థలాల వేలంపాటను అడ్డుకుంటామని ప్రకటించిన ఎమ్మెల్యే కృష్ణారావును హౌస్ అరేస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హౌసింగ్ బోర్డు వెస్ట్రన్ డివిజన్ పరిధిలోని 23 స్థలాలను హౌసింగ్ బోర్డు స్థలాను వేలానికి పెట్టారని, ప్రజలకు నిజాలు చెప్పకుండా మోసం చేస్తున్నారన్నారు. కాలనీ 15వ ఫేస్‌లో మాస్టర్ ప్లాన్ ప్రకారం…100 ఫీట్లు ఉన్న రోడ్డును… వేలంపాటలో 80 ఫీట్ల రోడ్డుగా చూపారని, కాలనీ 7వ ఫేస్‌లో 200 ఫీట్ల రోడ్డును 80 ఫీట్ల రోడ్డుగా చూపి..అమ్మకానికి పెట్టారన్నారు. ఈ పాట్లను కొనుగోలు చేసిన వారు…భవిష్యత్ రోడ్డు విస్తరణలో స్థలాన్ని కోల్పోవాల్సి వస్తుందని, వారికి నష్టం జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. కాలనీల్లో అక్కడక్కడ మిగిలిన చిన్న చిన్న బిట్లను కాలనీ ప్రజల అవసరాల కోసం వదలాలని కోరినప్పటికీ అధికారులు ఆ స్థలాలన్నింటినీ వేలానికి పెట్టారన్నారు.
మరోపైపు ఖాళీ స్థలాలను విక్రయించేముందు జీవో నంబర్ .6 ప్రకారం పక్కనున్న ప్లాట్ యజమానికి అవకాశం ఇవ్వాల్సి ఉండగా, బహిరంగ వేలంపాట ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. రోడ్డు విస్తరణలో ప్లాట్లు పోతే టీడీఆర్ వస్తుందని అధికారులు చెప్పడం సరికాదని, వారు ఇచ్చే టీడీఆర్ హౌసింగ్‌బోర్డు తీసుకుంటే బాగుంటుందని, అమాయకులైన ప్రజలను మోసం చేయవద్దని కోరారు. బహిరంగ మార్కెట్ కంటే ఎక్కువ ధరకు ప్లాట్‌ను కొనుగోలు చేస్తే… టీడీఆర్‌తో వచ్చేది పావువంతు కూడా కాదన్నారు. ఖాళీ స్థలాలను ప్రజలు కొనుగోలు చేసి మోసపోవద్దని కోరారు.
– ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
‘హౌసింగ్ బోర్డు అధికారులు సూచించన ప్రకారం… లక్ష రూపాయల డీడీని తీసుకున్నప్పటికీ…వేలం పాటకు వెళ్లకుండా పోలీసులు గృహ నిర్బంధం చేయడం సరికాదు.. నా హక్కులను కాలరాస్తారా’ అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని, పోలీసులు కూడా హద్దుదాటి వ్యవహరిస్తున్నదన్నారు. చట్టం ప్రకారం వేలంపాటలో పాల్గొనే హక్కు ఉన్నప్పటికీ అనుమతించకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేన్నారు. వేలానికి వెళ్లకుండా ఏసీపీతో పాటు నలుగురు ఎస్సైలు, 50 మంది కానిస్టేబుళ్లను పెట్టి తనను నిర్బంధించడం సరికాదన్నారు. ఈ వ్యవహారంపై పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని, న్యాయస్థానాన్ని అశ్రయించి పోరాడుతానన్నారు. కేపీహెచ్‌బీ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ నేతలను, కార్పొరేటర్లను హౌస్ అరెస్టు చేశారని మండిపడ్డారు.
కేపీహెచ్‌బీ కాలనీలోని హౌసింగ్ బోర్డు ఖాళీ స్థలాల విక్రయించేందుకు చేపట్టిన వేలంపాటను అడ్డుకునేందుకు యత్నించిన బీఆర్ఎస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటూ కేపీహెచ్‌బీ కాలనీ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు, బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ పగుడాల శిరీషాబాబురావు, కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ నేతలను గృహ నిర్బంధం చేశారు.