Kothwalguda Eco Park | సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): కోట్లు వెచ్చించి చేపట్టిన ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అక్షరాలా రూ.300 కోట్లకు పైగా అంచనాతో చేపట్టిన కొత్వాల్ గూడ ఎకో పార్కు ప్రాజెక్టును ఆరు నెలలుగా పట్టించుకున్న వారే కరువయ్యారు. ఇప్పటి వరకు సుమారు వంద కోట్లకు పైగా ఖర్చు చేసి రకరకాల అభివృద్ధి పనులు చేపట్టారు. ముఖ్యంగా అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన ల్యాండ్ స్కేపింగ్, బోర్డు వాక్ పనులు గతేడాది నవంబర్ నాటికే పూర్తి చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో కొత్వాల్‌గూడ ఎకో పార్కుకు రాజకీయ గ్రహణం పట్టింది.
గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష చేసిన దాఖలాలు లేవు. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ మహానగరంలో పర్యాటకానికి పెద్ద పీట వేస్తూ భారత దేశంలో ఇంతకు ముందు ఎక్కడా లేని విధంగా అత్యాధునిక పర్యాటక క్షేత్రాన్ని కొండలు, గుట్టల మధ్య నిర్మించాలని గత కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. నగరం ప్రతిష్టను పెంపొందించేలా ఔటర్ రింగు రోడ్డు పక్కన అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదు. కోట్లు వెచ్చించి చేపట్టిన ల్యాండ్ స్కేపింగ్‌తో పాటు ఇతర పనులన్నీ నిరుపయోగంగా మారే పరిస్థితి నెలకొన్నది.
ఐటీ కారిడార్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానం చేసే ఔటర్ రింగురోడ్డును ఆనుకొని ఉన్న సుమారు 85 ఎకరాల విస్తీర్ణంలో కొత్వాల్‌గూడ ఎకో పార్కు నిర్మాణం పనులు చేపట్టారు. ఇందులో ఎంతో ఆకర్షణీయమైన ల్యాండ్‌స్కేపింగ్, గుట్టల మధ్య హాయిగా నడిచేందుకు బోర్డు వాక్‌తో పాటు దేశంలోనే అతి పెద్ద అక్వేరియం, ఏవీయరీ (పక్షి శాల) కేంద్రాల నిర్మాణాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) చేపట్టింది. శివారు ప్రాంతంలో నగర వాసులకు అద్భుతమైన వినోద కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు గత ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చినా, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది.
చూస్తుండగానే 6 నెలలు గడిచిపోగా, పార్కులో ఇప్పటివరకు కోట్లాది రూపాయలు వెచ్చించి చేపట్టిన పనులకు ఫలితం లేకుండా పోతోంది. ఎకో పార్కు నిర్మాణ పనులు పూర్తయి ఉంటే.. మహానగరానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా నిలిచే అవకాశముండేది. అలాంటి ప్రాజెక్టును పట్టించుకోక పోవడం అంటే ప్రజా ధనాన్ని వృథా చేయడమేనని పలువురు విమర్శిస్తున్నారు.
నగర శివారు ఉన్న కొత్వాల్ గూడ పార్కును ఆనుకొని హిమాయత్‌సాగర్ జలాశయం ఏడాది పొడవునా నిండుగా ఉండటంతో చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది ఈ జలాశయం చూసేందుకు వచ్చి వెళ్తుంటారు. ఇలాంటి ప్రాంతంలోనే హెచ్ఎండీఏ చేపట్టిన ఎకో పార్కుతో ఎంతో మందికి ఆటవిడుపుగా మారేంది. ప్రభుత్వానికీ ఆదాయవనరుగా ఉండే ఈ ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోవడం లేదంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొత్వాల్‌గూడ ఎకో పార్కు పనులను పూర్తి చేసి నగర వాసులు సందర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.