సిటీబ్యూరో, జనవరి 5 (నమస్తే తెలంగాణ): బహుళ ప్రయోజనాలతో నగరాభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నగర మౌలిక వసతులకు పెద్దపీట వేసి, కేసీఆర్ ప్రభుత్వం రూ.140 కోట్లు ఖర్చు చేసి ప్రారంభించిన కొత్వాల్‌గూడ ఎకోపార్క్, మెహదీపట్నం స్కై వాక్ వే నిర్మాణాలు అందుబాటులోకి రావడమే గగనమైంది. ప్రాజెక్టుల అభివృద్ధిలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న నిర్లక్ష్య వైఖరితో వందల కోట్ల రూపాయలు ప్రజా ధనం నిరుపయోగంగా మారిపోయే పరిస్థితులు వస్తున్నాయి.
హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఔటర్‌కు సమీపంలో 100 ఎకరాల విస్తీర్ణంలో కొత్వాల్‌గూడ ఎకో పార్క్‌ను రూ.300 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును చేపట్టింది. అదే విధంగా పాదాచారుల కోసం దాదాపు రూ.20 కోట్ల అంచనా వ్యయంతో మెహదీపట్నం జంక్షన్లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టిన స్కై వాక్ వే ప్రస్తుతం పురోగతి లేకుండా పోయింది.
ప్రారంభానికి నోచుకోని
నగరంలో అంతర్జాతీయ స్థాయిలో ఎకో టూరిజంను డెవలప్ చేయడంలో భాగంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 125 ఎకరాల విస్తీర్ణంలో హిమయత్ సాగర్ సమీపంలో ఎకో పార్కును నిర్మించింది. దీనికోసం దాదాపు రూ.100కోట్లకు పైగా ఖర్చు చేసి ల్యాండ్ స్కేపింగ్, బోర్డ్ వాక్‌లూ పూర్తిచేశారు. విదేశీ పక్షులతో భారీ పక్షిశాల వంటి సదుపాయాలను డిజైన్ చేసింది. కానీ సౌకర్యాలు కూడా నిరుపయోగంగా మారుతున్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లుగా ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించకపోవడంతో ఎలాంటి పురోగతి లేకుండాపోయింది.
కొత్వాల్‌గూడ ఎకో పార్క్ ప్రారంభిస్తే ఏకో టూరిజం, పక్షిశాలతో పర్యాటక ఆదాయం పెరుగుతుంది. మెహదీపట్నం స్కై వాక్ వే ను 13 ఎలివేటర్లు, టన్నెల్‌తో పాదచారులకు సంరక్షణతోపాటు, రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. వాహనకాలుష్యం కూడా తగ్గుతుంది. కానీ వీటిని బీఆర్ఎస్ హయాంలో చేపట్టడం కారణంగానే ప్రస్తుత సర్కార్ జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రెండేళ్లుగా ఆగిన పనులను పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టులకు రాజకీయ గ్రహణం పట్టుకుందని నగరవాసులకు అభివృద్ధి ఫలాలు అందకుండా పోతున్నాయనే విమర్శలు ఉన్నాయి.
నగరంలో మరో స్కై వాక్ వే ప్రాజెక్టును హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మెహదీపట్నం సర్కిల్లో చేపట్టారు. దాదాపు కిలోమీటర్ మేర చుట్టూ ఉండే స్కై వాక్ వే పాదాచారులకు ఎంతోగానో ఉపయోగపడనుంది. దాదాపు రూ.35 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. రైతు బజార్ నుంచి మొదలై, డిఫెన్స్ ప్రహరీని ఆనుకుని నిర్మించే ఈ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ అనుమతులతో కొంత జాప్యం జరిగింది. అయితే అప్పుడే అన్ని అనుమతులతో కృషి చేయగా… ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదు. కనీసం ఈ ప్రాజెక్టు ఎందుకు ఆలస్యం అవుతుందో కూడా ప్రభుత్వం పర్యవేక్షించడం లేదు. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేస్తే స్థానికంగా పాదాచారులకు ఎదురౌతున్న ట్రాఫిక్ సమస్యలు తొలగి, ప్రమాదరహిత జంక్షన్‌గా మెహదీపట్నం మారనుంది. పాదచారులు కూడా స్కైవేను త్వరగా పూర్తిచేయాలని కోరుతున్నారు.