సిటీబ్యూరో: కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీలో ఆయన చెప్పిందే వేదం. యూనివర్సిటీ వైస్ చాన్సులర్కు తెలియకుండా డీన్లు, ప్రొఫెసర్లతో పాటు ఇతర అధికారులను ఆయన చెప్పుచేతుల్లో పెట్టుకుని పెత్తనం చెలాయిస్తున్నారు. పాలనాపరమైన విషయాలైనా.. బోధనా పరమైన విషయాలైనా.. విధాన పరమైన నిర్ణయాలైనా ఆయన చెప్పినట్లు జరిగి తీరాల్సిందే. రిజిస్ట్రార్‌తో కలిసి అన్ని విషయాల్లో తలదూరుస్తూ ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది దాకా హుకూం జారీ చేస్తున్నారు. ఇదంతా వైస్ ఛాన్సులర్ చేస్తున్నారేమో అనుకుంటే పొరపాటే.. ఆయన పేరు చెప్పుకుని వర్సిటీ సలహాదారుగా నియమితులైన రిటైర్డ్ ప్రొఫెసర్ సాగిస్తున్న తతంగమిది. ఆయన వేధింపులు నిత్యకృత్యమయ్యాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరైనా వినాల్సిందే..
ఉద్యాన యూనివర్సిటీలో ఏం జరగాలన్నా ఆయనకు తెలియకుండా జరగొద్దనే బహిరంగంగానే అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారని సమాచారం. యూనివర్సిటీలో ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపట్టడానికి, కొత్త విధివిధానాలు రూపొందించడానికి సంబంధిత అంశాలపై సుదీర్ఘ అనుభవం కలిగి, పదవీ విరమణ పొందిన వ్యక్తిని సలహాదారుడిగా నియమించుకుంటారు. పరిమిత జీతభత్యాలతో పాటు కొన్ని పరిమిత వసతులు కల్పిస్తూ వారి సేవలను వినియోగించుకుంటారు. వారి సలహాలు, సూచనలు కేవలం కేటాయించిన పనులకు మాత్రమే పరిమితం చేస్తారు. కానీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీలో గతేడాది నియమితులైన సలహాదారుడైన రిటైర్డ్ ప్రొఫెసర్ మాత్రం రిజిస్ట్రార్, వైస్ చాన్సులర్ కంటే తానే పవర్ఫుల్ అన్నంతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తున్నది. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ, స్కాలర్స్‌కు సంబంధించిన థీసిస్‌లకు ఆమోదం పొందాలన్నా ఆయన చెప్పినట్లే వినాలని చెప్తున్నారు.
ఇదంతా రిజిస్ట్రార్‌తో కలిసి ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీల ఉన్నతాధికారులతో పాటు ప్రొఫెసర్లు ఆయన ఆదేశాలే పాటించేలా వ్యవహరిస్తున్నట్లు వాపోతున్నారు. వైస్ ఛాన్సులర్ అనుభవం, ఆయన మీద ఉన్న గౌరవంతో ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకడమిక్ వ్యవహారాల్లో ఇతరుల జోక్యాన్ని సహించని వైస్ ఛాన్సులర్ కన్సల్టెంట్ విషయంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలియక అయోమయంలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైనా సలహాదారుడిని నియంత్రించి యూనివర్సిటీకి చెడుపేరు రాకుండా చూడాలని ప్రొఫెసర్లు, విద్యార్థులు కోరుతున్నారు.