సిటీబ్యూరో: శివారుల్లో జరుగుతున్న హత్యలను నిలువరించేందుకు రాచకొండ పోలీసులు బాలాపూర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి ప్రజలు బయటకు రావద్దంటూ రోడ్లపై కర్రలు పట్టుకొని తిరుగుతూ హడావిడి సృష్టించారు. అక్కడ అనధికారిక కర్ఫ్యూ ఏర్పాటు చేశారా? అనే పరిస్థిథి ఏర్పడింది… తీరా సోమవారం తెల్లవారుజామునే పోలీసులు హడావుడి చేసిన పోలీస్స్టేషన్ పరిధిలోనే మరో ఘటన చోటు చేసుకుంది. యువకులు కత్తులతో దాడులు చేసుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సోమవారం తెల్లవారుజామున 2.3 గంటల ప్రాంతంలో బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ముగ్గురు స్నేహితులు కత్తులతో దాడి చేసుకున్నారు. వట్టెపల్లి నుంచి ఫంక్షన్ కోసం ఎర్రకుంటకు వెళ్లారు. ఎర్రకుంటలో ముగ్గురి మధ్య వివాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు అరుచుకుంటూ కత్తులతో దాడులు చేసుకున్నారు. అందులో ఓ మైనర్పై మరో ఇద్దరు కత్తులతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రేమ వ్యవహారంలో ఈ గొడవ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. తనిఖీలు చేపట్టామని స్థానికులకు ఈ విషయం తెలుసని, గొడవపడ్డ వాళ్లు బయట నుంచి వచ్చిన వాళ్లని, వెయ్యి రూపాయల విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తోందని అధికారులు చెబుతున్నారు.